బోట్ల అగ్ని ప్రమాదంతో యూట్యూబర్ నానికి లింకేంటి...?

తనకు పోలీసుల నుంచి ప్రమాదం ఉందని తనను అంతం చేయాలని చూస్తున్నారు అంటూ తాజాగా యూ ట్యూబర్ నాని హైకోర్టును ఆశ్రయించారు. తనకూ తన కుటుంబానికి రక్షణ కల్పించమని వేడుకున్నాడు.

Update: 2023-11-24 16:15 GMT

యూట్యూబర్లు ఇపుడు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రొఫెషన్ గా చేసుకుని ఎదుగుతున్నారు. వారికి హాట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అన్నది చాలా ముఖ్యం. నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే సంచలనం వైపుగా పరుగులు తీస్తారు. అలా ఒక సంచలనమైన విశాఖ బోట్ల అగ్ని ప్రమాదం వార్తను తాను చిత్రీకరించి యూట్యూబ్ లో తన చానల్ లో మొదట పెట్టానని అదే తాను చేసిన నేరం అని లోక బాయ్ యూ ట్యూబర్ నాని అంటున్నారు.

తాను ఫస్ట్ ఆ ప్రమాదాన్ని హైలెట్ చేసినందుకు తననే పోలీసులు నిందితుడిగా చేశారు అని వాపోతున్నారు. తనకు పోలీసుల నుంచి ప్రమాదం ఉందని తనను అంతం చేయాలని చూస్తున్నారు అంటూ తాజాగా యూ ట్యూబర్ నాని హైకోర్టును ఆశ్రయించారు. తనకూ తన కుటుంబానికి రక్షణ కల్పించమని వేడుకున్నాడు. అలాగే పరువు నష్టం కింద ఇరవై లక్షల దాకా దావా వేశాడు.

ఇదిలా ఉంటే యూ ట్యూబర్ లోకల్ బాయ్ నానికి ఈ పడవల దగ్దం ప్రమాదానికి లింక్ ఏంటి అన్నది ఇపుడు అందరిలోనూ ఉన్న సందేహం. ఆ రోజు తాను ఒక పార్టీలో ఉన్నానని, తానే తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చానని నాని అంటున్నాడు. సరిగ్గా 11.45 నిముషాలకు తనకు ఫోన్ వచ్చిందని విశాఖ హార్బర్ లో బోట్లు తగలబడుతున్నాయని వచ్చిన ఫోన్ తో తాను అక్కడికి వెళ్లానని నాని మీడియాకు చెప్పాడు.

అలా వెళ్ళిన తాను అక్కడ ప్రమాద దృశ్యాలను తీసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశానని చెప్పాడు. ఇదంతా ప్రభుత్వం వెంటనే సమాచారం తెలుసుకుని బాధితులకు సాయం చేసేందుకు వస్తుందని బాధితులకు న్యాయం జరుగుతుందని భావించే ఇలా చేశాను అని నాని అంటున్నాడు. తాను మంచికి పోయి యూ ట్యూబ్ లో ఆ విషయం పోస్ట్ చేస్తే తనను నిందిడుతుని చేశారని ఆయన వాపోయాడు.

తాను అలా యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వెంటనే పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వారు తనను అదుపులో తీసుకుని గత నాలుగైదు రోజులుగా విపరీతంగా హింసిస్తున్నారని, తాను హైకోర్టుకు వెళ్లకపోతే తనను అంతం కూడా చేసి ఉండేవారు అని తీవ్ర ఆరోపణలే చేశాడు. తనకే కాదు తన కుటుంబానికి కూడా ప్రాణ హాని ఉందని నాని సంచలన కామెంట్స్ చేశాడు.

తనని సమాజంలో నిందితుడిగా మత్స్యకారుల పొట్టను కొట్టిన ద్రోహిగా దోషిగా చిత్రీకరిస్తున్నారని నాని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అంతా అర్ధం చేసుకోవాలని తనకు ఏ పాపం తెలియదని నాని అంటున్నాడు. ముఖ్యంగా గంగ పుత్రులు తనను అనుమానించకుండా అర్ధం చేసుకుంటే అదే పదివేలు అంటున్నాడు.

పోలీసులు తన మీద అన్యాయంగా కేసులు పెట్టారని తనని కాపాడాలని వేడుకుంటున్నాడు. ఇదిలా ఉంటే విశాఖ బోట్ల అగ్ని ప్రమాదం వెనక భారీ కుట్ర ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ఒక బోటు కాకుండా మొత్తం బోట్లను తగలబెట్టాలన్న కుట్ర కోణం వెనక రాజకీయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటివి జరగడం అంటే ఎవరికి మేలు చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని అన్న కోణంలో కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఎవరు ఈ పని చేసి ఉంటారు అన్న దాని మీద పోలీసులు ఈ రోజుకు సరైన నిర్ధారణకు రాలేకపోతున్నారు అని అంటున్నారు.

నాని అన్న యూ ట్యూబర్ తనకు తెలియదు మొర్రో అంటున్నాడు. మరి సూత్రధారి ఎవరు పాత్రధారులు ఎవరు అన్నది ఇంతటి పోలీస్ వ్యవస్థ కనుగొనకపోతే మాత్రం అది ఇబ్బంది అవడమే కాదు నిజంగా కుట్రకోణం ఉండి ఉంటే అలాంటి వారికి మరింత అలుసుగా అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందని అంతా అంటున్నారు. మొత్తానికి బీచ్ లో ఒక బోటులో పార్టీ జరిగింది అని మొదట వార్త వచ్చింది.

ఇపుడు చూస్తే లోకల్ బాయ్ నాని తాను వేరే చోట పార్టీ ఇచ్చాను అని చెబుతున్నాడు. ఇంకో వైపు ఒక బోటులో కొందరు మధ్య తాగిన మత్తులో చెలరేగిన ఘర్షణ వల్లనే ఇలా చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఇంతటి భారీ ప్రమాదం జరిగి అయిదారు రోజులు గడచినా ఇంకా మిస్టరీగానే ఉంది. నాని మాత్రం తనకేమి తెలియదు అంటున్నాడు. చూడాలి మరి ఎవరిని పట్టుకుంటారో, దీని వెనక ఎవరు ఉన్నారో.

Tags:    

Similar News