లోకేష్ అమెరికా యాత్ర...టార్గెట్ అదే !
ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకూ అంటే వారం రోజుల పాటు లోకేష్ అమెరికా టూర్ సాగనుంది.
టీడీపీ కూటమిలో ముఖ్యమైన నాయకుడు, ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా యాత్రకు రంగం సిద్ధం అయింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అమెరికా టూర్ వేస్తున్నారు. లోకేష్ చేతిలో ఐటీ శాఖ ఉంది. దాంతో ఆయన ఏపీకి ఐటీ పరంగా పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ పర్యటన చేస్తున్నారు అని అంటున్నారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకూ అంటే వారం రోజుల పాటు లోకేష్ అమెరికా టూర్ సాగనుంది.
ఈ సందర్భంగా లోకేహ్ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు ఏపీ నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులోనే ఆయన పలువురు ఐటీ పెట్టుబడిదారులను కలవనున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ పలు కీలకమైన భేటీలు నిర్వహించనున్నారు.
ఏపీలో పెట్టుబడులను తీసుకుని రావాలని తద్వారా ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలను పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఐటీ శాఖను దాని కోసం వినియోగించుకుంటున్న లోకేష్ ఏపీలో ఐటీ సెక్టార్ ని బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ ని రూపొందించారు. ఏపీలో ఈ రోజున విశాఖ ఐటీ పరంగా మొదటి స్థానంలో ఉంది.
ఆ తరువాత విజయవాడ తిరుపతిలలో ఐటీ సెక్టార్ ని డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అదే విధంగా టైర్ టూ సిటీస్ లోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఐటీ రంగం అభివృద్ధి చెందితే పెద్ద ఎత్తున ఉయోగ ఉపాధి అవకాశాలు వస్తాయని సేవా రంగం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు
ఐటీ మంత్రిగా ఒక టార్గెట్ పెట్టుకుని అమెరికా పర్యటన చేస్తున్న లోకేష్ ఎంతవరకూ పెట్టుబడులను ఆకర్షిస్తారో చూడాల్సి ఉంది. అయితే లోకేష్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీలు వేసైనా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. లోకేష్ అమెరికా పర్యటన మీద ఇపుడు సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
మరో వైపు ప్రభుత్వంలోనూ లోకేష్ ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలీ అంటే పెట్టుబడులు తప్పనిసరిగా అవసరం. దాంతో లోకేష్ ఫోకస్ పెట్టి మరీ అమెరికాతో తన తొలి విదేశీ యానానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు