లోకేష్ అలా హడలెత్తించేస్తున్నారు !

ఈ సందర్భంగా విశాఖలో పార్టీ రాజకీయాలను చక్క బెడుతున్నారు.

Update: 2024-10-19 15:37 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హడలెత్తించేస్తున్నారు. తనదైన శైలిలో ఆయన పాలనా పరంగా దూకుడు చూపిస్తారు. తరచూ విశాఖ వస్తున్న నారా లోకేష్ కనీసంగా మూడు రోజుల పాటు ఉంటున్నారు. ఈ సందర్భంగా విశాఖలో పార్టీ రాజకీయాలను చక్క బెడుతున్నారు. పార్టీ జిల్లా ఆఫీసులోనే ఆయన బస చేస్తున్నారు.

అంతే కాదు ఠంచనుగా ఆయన ప్రజా దర్బార్ ని నిర్వహిస్తున్నారు. ఇక మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తూ ప్రభుత్వం ఏమి చేస్తుందో కూడా చెబుతున్నారు. అదే విధంగా పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇక ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వినతుల మీద సంబధిత శాఖ అధికారులను పిలిపించుకుని వారికి వాటిని వేగంగా పరిష్కరించమని ఆదేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నారా లోకేష్ ఆకస్మిక పర్యటనకు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా స్థానిక సమస్యలను గుర్తిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అని అధికారులను నిగ్గదీస్తున్నారు.

లేటెస్ట్ విశాఖ టూర్ లో లోకేష్ విశాఖలోని ఒక ప్రాంతీయ గ్రంధాలయానికి వెళ్ళారు. అయితే ఆ సమయంలో గ్రంథాలయం తెరవకపోవడం పట్ల మంత్రి సీరియస్ అయ్యారు. సమయం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకే తెరవాల్సిన గ్రంథాలయం 9.45 అయినా తెరవకపోవడం పట్ల నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దాంతో ఆయన అక్కడికక్కడే ఒక నిర్ణయం ప్రకటించారు. ఏపీలోని గ్రంధాలయాలను పటిష్టం చేసేందుకు ఏపీ వ్యాప్తంగా వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గ్రంధాలయాల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

అనంతరం ఆయన మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలను కూడా మంత్రి సందర్శించి అక్కడ సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అక్కడ అంగన్వాడీ బాలలు ఉన్న చోటకు వెళ్ళి వారితో గడిపారు. వారితో కలసి సరదాగా ముచ్చటించారు.

అంతకు ముందు గత నెలలో లోకేష్ విశాఖ వచ్చినపుడు ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ బాత్ రూంలను స్వయంగా పరిశీలించి వాటికి గొళ్ళెం లేకపోవడం గమనించారు. బాలికలు ఉండే పాఠశాలలో ఈ విధంగానా చేసేది అని పాఠశాల సిబ్బంది మీద అసహనం వ్యక్తం చేశారు.

ఇలా విశాఖ విజయనగరం శ్రీకాకుళం దాకా నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయి. దాంతో లోకేష్ ఎపుడు ఎక్కడికి వస్తారో అక్కడ పరిస్థితుల మీద ఏ విధంగా ఆరా తీసి వివరణ అడుగుతారో అని అంతా ఒకింత అలెర్ట్ అవుతున్నారు. లోకేష్ ఆకస్మిక తనిఖీల పట్ల ప్రజలలో అయితే మంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంత్రి స్వయంగా ప్రతీ చోటా పర్యటిస్తే అధికారులలో కూడా చురుకుతనం వస్తుందని చాలా వరకూ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సరైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పాలనను గాడిలో పెట్టారు. ఆయన గట్టిగా ఉండడంతో పై నుంచి దిగువ దాకా ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా నియంత్రణలో ఉండేది అని కూడా అంటారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా తండ్రి బాటలో నడుస్తూ పాలనను గాడిలో పెడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News