మంత్రి లోకేశ్ ఆలోచన అదుర్స్ మంగళగిరి కోసం మరో పైలట్ ప్రాజెక్టు
రాష్ట్రంలో విద్యార్థులు భవిష్యత్ సాంకేతికతపై అవగాహన పెంచుకునేలా ఇన్ఫోసస్ సమకూర్చిన ప్రత్యేక బస్సు పాఠశాలల వద్దకు వెళ్లి టెక్నాలజీపై ప్రయోగాత్మకంగా బోధిస్తుంది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ మరో వినూత్న ఆలోచనకు కార్యరూపమిచ్చారు. ఆధునిక టెక్నాలజీపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)పై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
రాష్ట్రంలో విద్యార్థులు భవిష్యత్ సాంకేతికతపై అవగాహన పెంచుకునేలా ఇన్ఫోసస్ సమకూర్చిన ప్రత్యేక బస్సు పాఠశాలల వద్దకు వెళ్లి టెక్నాలజీపై ప్రయోగాత్మకంగా బోధిస్తుంది. ఇందులో ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక బస్సు సిద్ధమవగా, ఆ బస్సు ద్వారా మంగళగిరి నియోజకవర్గంలోని ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
ఈ నమూనా వాహనాన్ని ఉండవల్లిలోని తన నివాసంలో స్వయంగా పరిశీలించిన మంత్రి లోకేశ్ పైలట్ ప్రాజెక్టుగా ముందుగా తన సొంత నియోజకవర్గం మంగళగిరిని ఎంపిక చేశారు. డిజిటల్ ఇండియా విజన్, ఈఎస్ీ విజన్ 2030 (ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, ఎస్టీఈఎమ్ లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రధాన లక్ష్యం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలపై అవగాహన వస్తుందని, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ఏపీ మేకర్ ల్యాబ్ బస్సులో విద్యార్థులకు 90 నిమిషాల పాటు ఇంటరాక్టివ్ లెర్నింగ్ క్లాసు ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తి మేరకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్ ఫారమ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్పిస్తారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. మొబైల్ ల్యాబులో ల్యాప్ టాప్లు, ట్యాబులు, వర్క్ స్టేషన్లు, ప్రయోగాల కోసం ప్రత్యేక కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందు కోసం ఇన్ఫోసిస్ రూ.5 కోట్లను వెచ్చించి ఒక బస్సును ల్యాబ్ గా మార్చింది. దీనికి ఏటా రూ.40 లక్షలు నిర్వహణ వ్యయమవుతుంది. విద్యార్థులకు కోర్సు కంటెంట్ తోపాటు ట్రైనర్ సపోర్టు కూడా అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ ఒక్కో విద్యార్థిపై రూ.1500 ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు 4800 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రతిరోజూ 20 మంది విద్యార్థుల చొప్పున 4 బ్యాచ్ లకు శిక్షణ ఇస్తారు.