లోకేశా... అంత పెద్ద మాటలెందుకమ్మా...?
ఆయన ఆరు నెలలుగా పాదయాత్ర చేస్తున్నా కూడా లీడర్ గా ఇంకా ఎదగాల్సింది చాలా ఉందని అంతా అనుకుంటున్న మాట.
నారా లోకేష్ సన్ ఆఫ్ చంద్రబాబు. ఆయన ఆరు నెలలుగా పాదయాత్ర చేస్తున్నా కూడా లీడర్ గా ఇంకా ఎదగాల్సింది చాలా ఉందని అంతా అనుకుంటున్న మాట. లోకేష్ ఇంకా తనను తాను ఒక లీడర్ గా రుజువు చేసుకోవాల్సి ఉంది. ఆయన 2017లో మంత్రి అయ్యారు అంటే అది చంద్రబాబు సీఎం గా ఉండడం వల్లనే అన్నది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా ఉంటూ లోకేష్ మంత్రి అయ్యారు.
ఆయన 2019లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా జగన్ వేవ్ లో గెలిచి ఉన్నట్లు ఉన్నట్లు అయితే కచ్చితంగా ఆయన మీద వేరే ఇప్రెషన్ వేరే ఇమేజ్ వచ్చేది. అయినా మించిపోయింది లేదు 2024 ఎన్నికలు మరో చాన్స్ గా ఉన్నాయి. అయితే లోకేష్ పాదయాత్రలో మాట్లాడుతున్న మాటలు చేస్తున్న ప్రసంగాలు ఇస్తున్న హెచ్చరికలు చూస్తే మాత్రం అంత పెద్ద మాటలు ఎందుకు లోకేశా అని అంతా అంటున్న పరిస్థితి ఉంది.
చంద్రబాబు మూడు సార్లు సీఎం గా చేశారు. దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన నేను అధికారంలోకి వస్తే ఫలానా చేస్తాను అని చెబితే ఓకే కానీ సీఎం బాబు కాకుండా లోకేష్ అవుతున్నారా అన్నట్లుగా ఆరు నెలలు ఓపిక పట్టండి అందరి సంగతీ నేను తేలుస్తాను అని లోకేష్ అనడం అంటే చిత్రంగానే కాదు రాజకీయ తమాషాగా ఉంది.
లోకేష్ పాదయాత్ర మొత్తం మీద పేదలకు సామాన్యులను ఏమి హామీలు ఇస్తున్నారో తెలియదు కానీ వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తామని వారిని జైలు ఊచలు లెక్కబెట్టేలా చేస్తామని అంటున్నారు. ఇపుడు మరో మాట కూడా అంటున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీద అదే పనిగా మాటల దాడి చేస్తున్నారు. ఐపీఎస్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంతే కాదు టీడీపీ వస్తే నేను ఆయన కళ్ళకు ఆపరేషన్ చేయిస్తాను అని అంటున్నారు.
నిజంగా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం వస్తుందని అనే కంటే నేను అధికారంలోకి వస్తాను అన్నీ నేనే చూసుకుంటాను అని లోకేష్ అనడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇక వారి పని వీరి సంగతి చూడడానికేనా ఈ అధికారాలు లోకేషా అన్న ప్రశ్న కూడా వస్తోంది. నేను ఒక పుస్తకం పెట్టుకునా చిట్టా రాస్తున్నా అని లోకేష్ అంటున్నారు.
ఆ చిట్టాలో ప్రత్యర్ధులను ఎలా శిక్షిద్దామని రాసుకోవడమేనా లేక పేదలకు ఏమైనా న్యాయం చేసేది ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ఏపీలో టీడీపీలో చంద్రబాబు సీనియర్. రేపటి ఎన్నికల్లో బాబు అధికారంలోకి వస్తారు. టీడీపీ వస్తే ఈ మేలు చేస్తామని చెప్పాల్సిన చినబాబు అంతా నేనే అన్నీ నేనే అన్నట్లుగా మాట్లాడం ఒకింత ఆశ్చర్యంగానూ ఉంది అని అంటున్నారు.
టీడీపీలో లోకేష్ కి పోటీ ఎవరూ లేరు. చంద్రబాబు తరువాత ఆయనే హోల్ సేల్ పెత్తందారుగా ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో నాయకుడి కావాలంటే జనం మద్దతు తప్పనిసరిగా ఉండాలి. లోకేష్ అది మరచిపోతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా భాష చూసుకోవాలి. ప్రభుత్వాన్ని ఏలే పెద్దలతో సహా అందరినీ పట్టుకుని సైకోలు గూండాలు వీధి కుక్కలు అంటూ భాష వాడుతున్న లోకేష్ తన క్యాడర్ ని ఉత్సాహపరచగలరేమో కానీ న్యూట్రల్ ప్రజలను కానే కాదని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఉంది. అందులో తొలి పదమూడేళ్ళు ఎన్టీయార్ జమానా అయితే మిగిలినది అంతా చంద్రబాబు ఏలుబడిగానే ఉంది. ఇపుడు మూడవ తరంగా లోకేష్ ఆ బాధ్యతలను నిభాయించి మరో పాతికేళ్ల పాటు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలీ అంటే ఎంత సహనం, ఎంత సంయమనం ఉండాలన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజకీయాల్లో దూకుడు ఉండాలి. సభలలో మాటలు తూకం వేసినట్లుగా ఉండాలి, విమర్శలు కూడా చేసే విధానంలో చేయవచ్చు. కానీ లోకేష్ మాత్రం బ్యాలెన్స్ తప్పుతున్నారనే అంటున్నారు.
ఇక ఓపిక లేదు అందరికీ వడ్డీలతో సహా చెల్లిస్తామని లోకేష్ పదే పదే అనడం ద్వారా కక్షలను తీర్చుకోవడం కోసమే అధికారం కావాలని అడుగుతున్నట్లుగా ఉంది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకూ ఆమోదించి అధికారాన్ని ఇస్గ్తారన్నది గుర్తు పెట్టుకోవాలి.
ఇక వ్యవస్థలో అధికారులు ఉంటారు. వారు విధులను నిర్వహించే విషయంలో ఇబ్బందులు వచ్చినా వారిని సైతం రాజకీయ నేతల మాదిరిగా పదే పదే విమర్శలతో చీల్చి చెండాడితే టోటల్ వ్యవస్థకే పార్టీని దూరం చేస్తున్నామన్న విషయాన్ని మరచిపోతే ఎలా లోకేష్ అన్న సూచనలు వస్తున్నాయి.
చినబాబు పాదయాత్ర కొలమానం నాలుగు వేల కిలోమీటర్లు కావచ్చు. కానీ ఆయనకు ఉన్న టీడీపీ బాధ్యతలు రాజకీయ ప్రయాణ సుదీర్ఘమైనది, అది పాదయాత్ర కంటే కోటి రెట్లు అత్యంత కఠినమైనది. అందువల్ల యువ నాయకుడు జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆయనకూ టీడీపీకి మేలైన రోజులు అన్న సంగతి మరువరాదు అంటున్నారు హితైషులు.