లోకేశ్ హైలెట్ కావట్లేదేంటి? తెర వెనుకేం జరిగింది?

ఏపీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలోనూ చర్చ జరగటం లేదు.

Update: 2024-04-27 07:30 GMT

ఏపీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలోనూ చర్చ జరగటం లేదు. ఆ మాటకు వస్తే అధికార వైసీపీ కూడా గుర్తించలేదని చెప్పాలి. కేవలం తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాత్రమే చర్చ జరుగుతోంది. పార్టీలో సెకండ్ ప్లేస్ లో ఉండే నారా లోకేశ్ అలియాస్ చినబాబు ఈ మధ్యన బొత్తిగా హైలెట్ కాకపోవటం.. అయ్యగారి హాట్ ప్రసంగాలు మీడియాలోనూ పెద్దగా కవర్ కాకపోవటం తరచూ చర్చ జరుగుతోంది. సుదీర్ఘ పాదయాత్ర వేళలో.. లోకేశ్ ను హైలెట్ చేసేందుకు ప్రయత్నాలు జరగటం.. దానికి వచ్చిన స్పందన అంతంత మాత్రంగా ఉండటం తెలిసిందే.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు నారా లోకేశ్ రాజకీయ భవితకు ప్రశ్నగా మారతాయని చెప్పక తప్పదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఆయన.. ఈసారి అక్కడి నుంచే బరిలోకి దిగటం తెలిసిందే. ఈ మొత్తం ఎన్నికల ఎపిసోడ్ లో నామినేషన్ పత్రాన్ని తండ్రి కం పార్టీ అధినేత నుంచి తీసుకునేటప్పుడు ఫోటోలతో మీడియాలో హైలెట్ అయ్యారే తప్పించి.. మిగిలిన రోజుల్లో పెద్దగా కనిపించని పరిస్థితి.

ఎందుకిలా? అసలేమైంది? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాటల మంటలు పవన్ కల్యాణ్ కు ఇబ్బందికరంగా మారాయని చెబుతున్నారు. అంతేకాదు.. చినబాబు పుణ్యమా అని.. కూటమి ఏర్పాటు సైతం ఆలస్యమైందని.. లోకేశ్ మాట్లాడే మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. అవసరం లేని మాటలు రావటం.. ఆయన వ్యాఖ్యలు కొన్ని.. అధికార పార్టీకి అవకాశాన్ని కలుగజేసేలా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో.. ఆయన్ను మంగళగిరికి పరిమితం కావాలన్న విషయాన్ని చంద్రబాబు క్లియర్ గా చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈసారి ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతుందన్న విషయం తెలిసిందే. అందుకే.. రాష్ట్ర స్థాయి అంశాల జోలికి వెళ్లకుండా.. బుద్దిగా మంగళగిరికే పరిమితం కావాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మిగిలిన సంగతులు చూసుకోవచ్చన్న వ్యూహంతోనే ఆయన కామ్ గా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. చివరకు టీడీపీ అనుకూల మీడియాలోనూ చినబాబును అవసరానికి మించి హైలెట్ చేయకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అతి ప్రచారంతో లేని సమస్యలు ఎదురవుతాయని.. అండర్ డాగ్ మాదిరి ఉంటేనే బెటర్ అన్న ఉద్దేశంతోనే లోకేశ్ ను హైలెట్ చేయటం లేదంటున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వేళ.. లోకేశ్ ఎన్నికల ఫలితం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News