జగన్ డైలాగ్ కు లోకేశ్ పంచ్ పేల్లేదు
అందుకు ఉదాహరణగా తాజాగా ఉత్తరాంధ్రలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ''సైకిల్.. గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థం కాదు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీ అధినేతలు.. ముఖ్యనేతల మాటల్లో తేడా వచ్చేస్తాయి. ఘాటైన పదాలతో ప్రజల వద్దకు వెళ్లటం ద్వారా వారిని ఇట్టే ఆకర్షించటం.. ప్రత్యర్థులకు మాటలతో సవాలు విసరటం మామూలే. ఈ సందర్భంగా వారి నోటి నుంచి వచ్చే పంచ్ మాటలకు అంతే పవర్ ఫుల్ గా రియాక్టు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ ముఖ్యనేత లోకేశ్ తేలిపోయారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా నిర్వహించిన రాప్తాడు సభలో మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ.. జనసేనలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే.
ఆయన ప్రసంగంలో భాగంగా టీడీపీ గుర్తులైన సైకిల్.. జనసేన గుర్తైన టీ కప్పును ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సైకిల్ బయటే ఉంటుందని.. టీ గ్లాస్ సింక్ లో పడేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతటి పవర్ ఫుల్ డైలాగ్ సీఎం జగన్ నుంచి వచ్చిన తర్వాత మాటకు మాట అన్నప్పుడు బదులు భారీగా ఉండాల్సిందే. కానీ.. లోకేశ్ కు స్క్రిప్టు రైటర్ల కసరత్తు సరిగా లేదనే చెప్పాలి. ఎందుకుంటే.. తాజాగా లోకేశ్ నోటి నుంచి వచ్చిన కౌంటర్ సో.. సోగా ఉండే తప్పించి.. ధీటుగా లేదన్నది మర్చిపోకూడదు.
సైకిల్.. పేదోడి చైతన్య రథమని.. అదెప్పుడు ప్రజల మధ్యే ఉంటుందని.. సూకిల్.. గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థం కాదన్నారు లోకేశ్. రెక్కలు విరిగిన ఫ్యాన్ ను చెత్తలో పడేసే రోజులు దగ్గర్లోనే అంటూ సాగిన లోకేశ్ మాటల్ని చూస్తే.. మాటకు మాట అన్నట్లుగా లేకపోవటం పెద్ద లోపంగా చెబుతున్నారు. పంచ్ డైలాగకు అంతే పంచ్ అన్నట్లుగా ఉండాలే తప్పించి.. ఏదో కిందా మీదా పడినట్లుగా మాటలు ఉండకూడదు.
అందుకు ఉదాహరణగా తాజాగా ఉత్తరాంధ్రలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ''సైకిల్.. గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థం కాదు. సామాన్యులు ప్రతి ఒక్కరూ గ్లాస్ లోనే టీ తాగి.. తర్వాత శుభ్రం చేసుకొని మరోసారి వినియోగించుకుంటారు. బహుశా జగన్ బంగారు. వెండి గ్లాస్ లో టీ తాగుతారేమో? ఫ్యాన్ రెక్కలు ఎప్పుడో విరిగిపోయాయి.. దానిని చెత్తబుట్టలో పడేయటం ఒక్కటే మిగిలింది'' అంటూ కౌంటర్ గా సాగిన వ్యాఖ్యల్లో ఎలాంటి పవర్ కనిపించలేదన్న మాట వినిపిస్తోంది.
కీలక సందర్భాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించే వైఫల్యం చేసే నష్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని లోకేశ్ గుర్తించాలంటున్నారు. ధీటైన సమాధానం ఇవ్వలేనప్పుడు మౌనంగా ఉండాలే తప్పించి.. కెలికి మరీ కంపు చేసుకోవటంలో అర్థం లేదనే చెప్పాలి.
రాప్తాడు సభలో సీఎం జగన్ చేసిన బలమైన వ్యాఖ్యకు ధీటుగా బదులిచ్చే సత్తా లేనప్పుడు.. ఆ విషయాన్ని అక్కడితే వదిలేసి.. కాస్తంత కసరత్తు చేసిన తర్వాత పంచ్ వేస్తే బాగుండేది. కానీ.. అలా ఏమీ చేయలేని తీరు కీలకమైన ఎన్నికల సమయంలో సరిగా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా.. తమకు కంటెంట్ రాసిచ్చే రైటర్ల విషయంలో లోకేశ్ మరింత 'సిద్ధం' చేయాల్సి ఉందన్నది మర్చిపోకూడదు.