పవన్ కళ్యాణ్ కి జై అంటున్న లోకేష్... పొత్తు హిట్టేనా...?

రాజకీయ గణిత శాస్త్రంలో ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అవవచ్చు ఒకటి అవవచ్చ్. ఏమీ కాకపోవచ్చు కూడా.

Update: 2023-11-30 04:42 GMT

రాజకీయ గణిత శాస్త్రంలో ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అవవచ్చు ఒకటి అవవచ్చ్. ఏమీ కాకపోవచ్చు కూడా. పొత్తులు ఎపుడు హిట్ అవుతాయంటే జనాలు కూడా వాటిని బలంగా కోరుకున్నపుడు. దేశంలో 1977 టైం లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద విసిగిన జనాలు ప్రతిపక్షం అంతా కలవాలని కోరుకున్నారు. అదే జరిగింది. జనాలు ఓటేసి గెలిపించారు. మళ్లీ రాజీవ్ గాంధీ ఏలుబడిలో నేషనల్ ఫ్రంట్ విషయంలో జనాలు విపక్షాలను కూటమి కడితే గెలిపించారు. వాజ్ పేయ్ మీద గౌరవంతో కార్గిల్ ఇష్యూ తో ఎన్డీయే కూటమిని 1999 ఎన్నికల్లో గెలిపించారు.

ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే జనాల మూడ్ చూడకుండా అధికారంలోకి రావాలని అనుకుంటే మాత్రం దెబ్బ తిన్న ఉదంతాలు ఉన్నాయి. యూపీలో ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో విపక్షాలు కలసి పోటీ చేసినా అధికార బీజేపీ రెండవసారి గెలిచి యోగీ ఆదిత్యానాధ్ సీఎం గా ప్రమాణం చేశారు.

అలాగే విపక్షాలు కూటమి కట్టకపోతే ఓట్లు చీలి గెలుస్తామని అనుకున్నా తప్పు అని ఆరు నెలల క్రితం జరిగిన కర్నాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. విపక్షాల ఓట్లు చీలితే మళ్ళీ తనదే అధికారం అని 2019 వేళ టీడీపీ అనుకుంటే అది కూడా తప్పు అని జగన్ని గెలిపించేశారు జనాలు.

ఇలా జనాల గురించి వారి తీర్పుల గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కళ్ళ ముందు ఉండగా పొత్తులు హిట్ అన్నది అవుతుందా లేదా అంటే మళ్లీ జనం వైపే చూడాల్సి ఉంటుంది. ఏపీలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన కలిశాయి. పొత్తులు పెట్టుకున్నాయి. ఈ పొత్తుల మీద రెండు పార్టీలలో ఎలా ఉందో ఇంకా తెలియదు. పొత్తులు అంటే త్యాగాలు చేయాలి. అటూ ఇటూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి.

అపుడే ఓట్ల బదిలీ సాఫీగా అవుతుంది. ఇదిలా ఉంటే ఇపుడు ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని ఫస్ట్ టైం టీడీపీ నేతలు చెప్పాల్సి వస్తోంది. నిజానికి టీడీపీ గెలుస్తుంది అని చంద్రబాబు అరెస్ట్ ముందు వరకూ చెప్పేవారు. మరి అరెస్ట్ తరువాత సానుభూతి వెల్లువెత్తాల్సి ఉంది. అదే జరిగితే ఇంకా బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావాలి. సింగిల్ గానే అది జరగాలి.

కానీ దానికి రివర్స్ లో జనసేన టీడీపీ కాంబో అంటున్నారు. ఏకంగా లోకేష్ తన పాదయాత్ర లో ఇదే చెబుతున్నారు. అంతే కాదు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో జనసైనికులను ఖుషీ చేసేందుకు ఈ నినాదం అని అనుకుంటే అది ఇంకా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

జనసైనికులకు తమ నేత సీఎం కావాలని ఉంది. చంద్రబాబుతో సమానంగా పవన్ నాయకత్వం వర్ధిల్లాలి అనడం అంటే సీఎం సీటు షేరింగ్ కి ఒప్పుకున్నట్లే అన్న సౌండ్ కూడా వినిపిస్తుంది. దానికి టీడీపీ సిద్ధంగా ఉందా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. అదే విధంగా ఎక్కువ సీట్లు జనసేనకు పొత్తులో భాగంగా ఇస్తారా అన్నది మరో ప్రశ్న.

ఎట్టి పరిస్థితుల్లోనూ నలభైకి మించి సీట్లు పొత్తులో ఇస్తే కనుక అపుడు పొత్తు హిట్ కావడం అటుంచి టీడీపీలోనే అసంతృప్తి పెరుగుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకున్నారా లేక క్యాడర్ కి హుషార్ పుట్టిస్తే చాలు అనుకుంటున్నారా తెలియదు కానీ పవన్ కి జై అంటే మాత్రం అది ఇంతటితో ఆగేది కాదు అన్న మాట అయితే ఉంది. పవన్ తో పొత్తు మిగిలిన పార్టీల మాదిరిగా కాదు అన్నది టీడీపీకి ఇప్పటికే తెలిసి ఉండాలి. తెలియకపోతే మాత్రం ఇది కొత్త అనుభవంగా మారుతుంది అన్నది కొద్ది నెలలు ఆగితే తెలుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News