బీజేపీ : సిట్టింగ్ మే దడ దడ !
ఎన్డీఎ కూటమిలో పెద్ద పార్టీ అయిన బీజేపీ దాదాపు 450 స్థానాల నుండి ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపింది
ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థుల వ్యతిరేకత ఎక్కడ ఓటమికి దారితీస్తుందోనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు ట్రాన్స్ ఫర్ చేయడం, కొంత మందికి టికెట్ నిరాకరిచిన విషయం తెలిసిందే. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించింది.
ఎన్డీఎ కూటమిలో పెద్ద పార్టీ అయిన బీజేపీ దాదాపు 450 స్థానాల నుండి ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అందులో 130కి పైగా అభ్యర్థులు కొత్తవారు కాగా, సిట్టింగ్ ల మీద ఉన్న వ్యతిరేకత ఫలితాలను తారుమారు చేస్తుందన్న అనుమానంతో 110 మంది వరకు సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించినట్లు తెలుస్తున్నది. ఇవి కాకుండా సిట్టింగ్ ఎంపీల మరణం, అనారోగ్యం, శాసనసభలకు ఎన్నికైన కారణాలతో మరో 20 మంది వరకు కొత్తవారికి ఇచ్చినట్లు సమాచారం.
గతంలో ఎంపీలుగా పనిచేసిన వారికే కాకుండా కేంద్రమంత్రులుగా పనిచేసిన 11 మందికి కూడా బీజేపీ టికెట్లు ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో పక్కనబెట్టింది. ఈ జాబితాలో అశ్వినీ కుమార్ చౌబే, జనరల్ వీకే సింగ్, మీనాక్షి లేఖీ, దర్శనా విక్రమ్, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలీ, నారాయణ స్వామి, ప్రతిమా భౌమిక్, రాజ్‌కుమార్ రంజన్‌సింగ్, బిశ్వేశ్వర్, మంజుపారా ఉన్నారు.
యూపీలో 15, గుజరాత్ లో 14, మధ్యప్రదేశ్ లో 14, రాజస్థాన్ 14, కర్ణాటక 13, చత్తీస్ ఘడ్ 8, మహారాష్ట్ర 7, బెంగాల్ 6, ఢిల్లీ 6, జార్ఖండ్ 5, హర్యానా 5, అస్సాం 5, ఒడిశా 4, బీహార్ 3, హిమాచల్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్ లలో 2 చొప్పున, తెలంగాణ, మణిపూర్, చండీఘడ్ లలో ఒకరు చొప్పున సిట్టింగ్ లకు బీజేపీ సీట్లు నిరాకరించింది. గత ఏడాది కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఇదే సూత్రం అమలు చేసినా బీజేపీకి కలిసిరాలేదు. ఈ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి.