తొలివిడతలో ఖతర్నాక్ స్థానాలు ఎన్నంటే?

తొలి విడతలో ఎన్నికలు జరిగే 102 స్థానాలకు 42 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముగ్గురు అంతకంటే ఎక్కువమంది క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు

Update: 2024-04-09 07:23 GMT

సుదీర్ఘంగా సాగే సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ షురూ కానుంది. మరో పది రోజుల్లో (ఏప్రిల్ 19న) జరిగే ఈ పోలింగ్ వేళ దేశంలోని 543 స్థానాలకు 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో ఖతర్నాక్ అన్నట్లుగా ఉండే లోక్ సభ స్థానాలకు సంబంధించిన వివరాల్నిఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ వెల్లడించింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే 102 స్థానాలకు 42 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముగ్గురు అంతకంటే ఎక్కువమంది క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు.

మొదటి విడతలో బరిలో ఉన్న 1625 మంది అభ్యర్థుల్లో 1618 మంది అభ్యర్థు అఫిడవిట్లను ఏడీఆర్ సంస్థ విశ్లేషించింది. వీరు గుర్తించిన అంశాల్ని చూస్తే.. 1618 మంది అభ్యర్థుల్లో 16 శాతం అభ్యర్థులు అంటే 252 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 10 శాతం మంది అంటే 161 మంది మీద తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు ఉండటం గమనార్హం. ఏడుగురు అభ్యర్థులపై హత్య కేసులు ఉండగా.. మరో 19 మంది మీద హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినట్లుగా 18 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నట్లుగా తెలిపింది. వీరిలో ఒకరిపై అత్యాచార కేసు కూడా నమోదై ఉండటం గమనార్హం.

మొదటి విడతలో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో 42 స్థానాలు ఖతర్నాక్ స్థానాలుగా తెలిపింది. వీటికి రెడ్ అలెర్టు నియోజకవర్గాలుగా పేర్కొంది. ఈ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. తొలి విడతలో పోటీ చేసే నలుగురు ఆర్జేడీ అభ్యర్థుల్లో నలుగురి మీదా క్రిమినల్ కేసులు ఉన్నాయి. డీఎంకేకు చెందిన 22 మంది అభ్యర్థుల్లో 13 మంది మీద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఏడుగురిలో ముగ్గురు మీదా.. టీఎంసీ తరఫున బరిలో ఉన్న ఐదుగురిలో ఇద్దరు మీదా.. బీజేపీకి చెందిన 77 మంది అభ్యర్థుల్లో 28 మంది మీదా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 56 మందిలో 19 మంది మీదా క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అన్నాడీఎంకే తరపున బరిలో ఉన్న 36 మంది అభ్యర్థుల్లో 13 మందిపై.. బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న 86 మందిలో 11 మంది మీదా కేసులు ఉన్నాయి. కేసుల సంగతి ఇలా ఉంటే.. మొదటి దశలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరులకు కొదవ లేదు. మొత్తం అభ్యర్థుల ఆస్తిని పరిగణలోకి తీసుకొని సగటున ఒక్కో అభ్యర్థి ఆస్తిని లెక్కిస్తే రూ.4.51 కోట్లుగా తేల్చారు. కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారు మొత్తం అభ్యర్థుల్లో 28 శాతం ఉన్నారు.

తొలి విడత పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్ తన మొత్తం ఆస్తులు రూ.716 కోట్లుగా పేర్కొన్నారు. ఆయన మొదటి స్థానంలో నిలిస్తే రెండో స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రూ.662 కోట్లు.. బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ కు రూ.304 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరులుగా చూస్తే.. ఆర్జేడీ తరఫున బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులుకోటీశ్వరులే.

అన్నాడీఎంకే నుంచి బరిలో ఉన్న 35 మంది.. డీఎంకే నుంచి బరిలో ఉన్న 21 మంది.. బీజేపీకి చెందిన 69 మంది.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే 49 మంది టీఎంసీకి చెందిన నలుగరు.. బీఎస్పీకి చెందిన 18 మంది అభ్యర్థులకు కోటి రూపాయిల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. కేసులే కాదు కోట్లకు కూడా కొదవలేనోళ్లే అభ్యర్థులన్నమాట.

Tags:    

Similar News