ఈ మహిళా అభ్యర్థిని మార్చేస్తున్న పవన్!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాము వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతలో పవన్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవికి పవన్ సీటు కేటాయించారు.
వాస్తవానికి నెల్లిమర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు టికెట్ ఆశించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం మంది ఓటర్లు తూర్పు కాపులే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన లోకం మాధవి అభ్యర్థిత్వంపై పవన్ పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు.
లోకం మాధవి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె ఐటీ సంస్థల యజమానిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా జనసేన నుంచి నెల్లిమర్లలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేవలం 12 వేలకు పైగా ఓట్లు మాత్రమే సాధించారు, తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న నెల్లిమర్లలో లోకం మాధవి గట్టి పోటీ ఇవ్వలేరని జనసేన శ్రేణులతోపాటు టీడీపీ శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
వాస్తవానికి లోకం మాధవి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారయినప్పటికీ ఆమె భర్త కాపు వర్గానికి చెందిన వ్యక్తేనని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లోకం ప్రసాద్ ఆమె భర్త.
మరోవైపు తనకు పార్టీ అధినేత సీటును ఖరారు చేయడంతో లోకం మాధవి చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అన్ని ప్రాంతాలను కలియదిరుగుతున్నారు. ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. తనన గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గానికి ఐటీ కంపెనీలను తీసుకొస్తానని చెబుతున్నారు.
అయితే జనసేన, టీడీపీ శ్రేణులు.. నెల్లిమర్ల నుంచి మాధవిని తప్పించి విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సూచిస్తున్నారు. విశాఖపట్నం దక్షిణంలో అయితే బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారట. ఈ నేపథ్యంలో మాధవిని అక్కడి నుంచి పోటీ చేయించాలని పవన్ ను కోరుతున్నారు. గతంలో ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్ వంటి బ్రాహ్మణ నేతలు విశాఖ దక్షిణం నుంచే గెలిచారని గుర్తు చేస్తున్నారు.
లోకం మాధవికి నెల్లిమర్ల సీటు ఇస్తే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలు ఓట్లేయరని జనసేన శ్రేణులు పవన్ కు వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను విశాఖ దక్షిణం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని నివేదించినట్టు తెలుస్తోంది.
2019లో నెల్లిమర్ల నుంచి వైసీపీ తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు బడుకొండ అప్పలనాయుడు పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఆయనే పోటీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. బడుకొండ అప్పలనాయుడు తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో జనసేన తరఫున కూడా నెల్లిమర్లలో బీసీ అభ్యర్థిని పెట్టాలని అంటున్నారు. ఇలా కాని పక్షంలో లోకం మాధవిని విశాఖ సౌత్ నియోజకవర్గానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.