7 తరాలు కాదు.. 700+... పెళ్లిలో సిబిల్ స్కోర్ కీ రోల్!

'సిబిల్' స్కోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఓ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణకు నిలువుటద్దం అని ఒకరంటే..

Update: 2025-02-08 07:24 GMT

'సిబిల్' స్కోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఓ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణకు నిలువుటద్దం అని ఒకరంటే.. అది ప్రైవేటు సంస్థ చేతుల్లోని అద్దమని, అది బ్రహ్మ పదార్ధమని, ఓ వ్యక్తి ఆర్థిక చరిత్ర మొత్తం ఆ ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంటుందని, ఇది చాలా ప్రమాదమని, మధ్య తరగతి ప్రజల జీవితాలను ఈ 'సిబిల్' శాసిస్తుందని మరికొంతమంది చెబుతుంటారు.

దీనిపై ఇటీవల పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో భాగంగా.. అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు.. అది ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తుంది అంటూ లోక్ సభలో ఆయన ప్రస్థావించారు. ఈ సమయంలో ఆ సిబిల్ స్కోర్ కారణంగా తాజాగా ఓ వరుడికి బిగ్ షాక్ తగిలింది.

అవును... సాధారణంగా ఆడ పిల్లలకు పెళ్లి చేసే ముందు.. వరుడి గురించి ఆమె తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేస్తుంటారు. ఈ సందర్భంగా.. అబ్బాయి ఎలాంటి వాడు.. చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా.. ఎంత సంపాదిస్తున్నాడు.. సంపాదిస్తున్నట్లు చెప్పిన మొత్తం నిజమేనా.. ఆ కుటుంబం ఎలాంటిది మొదలైనవి ఆరా తీస్తుంటారు.

అందుకే... వివాహం విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ఇప్పుడు మాత్రం తాజాగా సిబిల్ స్కోర్ కనీసం 700 దాటి లేదనే కారణంతోనో.. మరీ 500 కంటే తక్కువుందనే కోపంతోనో.. వరుడికి షాకిచ్చింది ఆడపిల్ల కుటుంబం. సిబిల్ స్కోర్ తక్కువ ఉందనే కారణంతో పెళ్లికి నిరాకరించారు.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రంలోని మూర్తిజాపూర్ కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారంట. ఈ క్రమంలో.. ఇరు కుటుంబాలకు అంగీకారం కావడంతో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారంట. అయితే.. ఈ వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ.. వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేశారంట.

ఈ సమయంలో అతడు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారని అంటున్నారు. వాటిని సక్రమంగా చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం గమనించారట. దీంతో.. వారు పెళ్లికి నిరాకరించారని అంటున్నారు. దీతో... ఈ విషయం వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో కామెంట్ సెక్షన్ కళకళాలాడుతోందని అంటున్నారు!

ఇందులో భాగంగా... ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి.. తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడనే ఆలోచన ఆడపిల్ల పేరెంట్స్ కి కలగడం మంచిదే అని ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. ఇదే సమయంలో.. ఆ రుణాలు కుటుంబ బాధ్యతల కోసమా.. జల్సాల కోసం తీసుకున్నాడా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది అని ఇంకొకరు అంటున్నారు.

ఏది ఏమైనా... ఈ స్థాయిలో పెళ్లిలో అబ్బాయి సిబిల్ స్కోర్ కూడా కీలక భూమిక పోషించే పరిస్థితే అయితే... దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య అమాంతం విపరీతంగా పెరిగిపోతుందనడంలో సందేహం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News