మా తాతకు పెళ్లి !
పురోహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా తాత, అవ్వలు తమ పిల్లలు, వారి మనవలు, ముని మనవల సమక్షంలో ఒక్కటయ్యారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా. అక్కడ 86 ఏళ్ల గుగులోత్ సమిడా నాయక్, 80 ఏళ్ల గుగులోత్ లాలమ్మలు 67 ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు.
వారికి కుమారులు మంగీలాల్, హరిలాల్, నర్సయ్య, చందులాల్, కుమార్తె సాయమ్మలు సంతానం. ఎవరికి వారు జీవితంలో స్థిరపడ్డారు. కాలక్రమంలో నర్సయ్య, చందులాల్ మరణించారు. అయితే తమ కోసం ఇంతలా కష్టపడ్డ తాతయ్య, నాయినమ్మలకు పెళ్లి చేయాలని చందులాల్ కుమారుడు యాకుబ్ భావించాడు. అనుకున్నదే తడవు తన ఆలోచనను కుటుంబ సభ్యుల ముందు ఉంచాడు. దానికి అందరి ఆమోదం లభించింది.
ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. బంధుమితృలు, తండా వాసులను ఆహ్వానించారు. పురోహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా తాత, అవ్వలు తమ పిల్లలు, వారి మనవలు, ముని మనవల సమక్షంలో ఒక్కటయ్యారు. మనవళ్లు చేసిన ఈ పెళ్లిని అందరూ అభినందించారు.