భారత్ తో వివాదం వేళ.. మాల్దీవులు మరో దుందుడుకు చర్య!
అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు స్పందించారు
ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ మొయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మనదేశంతో ఆ దేశ సంబంధాలు క్షీణించేలా ఆయన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. భారత్ వ్యతిరేకిగా... చైనాకు అనుకూలుడిగా మహ్మద్ మొయిజ్జుకు పేరుంది. ఇందుకు తగ్గట్టే తాను అధికారంలోకి రాగానే తన తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనాను ఎంచుకోవడం గమనార్హం. తన సతీమణితో కలిసి నాలుగు రోజులపాటు మొయిజ్జు చైనాలో పర్యటించారు.
ఆ సమయంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించడం.. లక్షద్వీప్ టూరిజాన్ని ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగానే మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు వెటకారంగా స్పందించడం కాకరేపింది. మోడీని కించపరుస్తూ, భారతదేశ టూరిజాన్ని తక్కువ చేస్తూ మాట్లాడటంతో భారతీయులకు చిర్రెత్తింది. మాల్దీవులకు ఏకంగా 8000 బుకింగ్స్‌మనదేశం నుంచి రద్దయ్యాయి. పలువురు తమ టూర్ ను రద్దు చేసుకున్నారు. మాల్దీవులకు వెళ్లడానికి బుక్ చేసుకున్న విమాన టికెట్లను కూడా రద్దు చేసుకున్నారు.
అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు స్పందించారు. తమ దేశం చిన్న దేశమంటూనే తమ సార్వభౌమాధికారంలో వేలుపెట్టే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. దీనికి చైనా వంతపాడటం గమనార్హం. మాల్దీవుల విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకోవడమే మంచిదని చైనా సుద్దులు చెప్పింది.
ఇంతలోనే తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. చైనా పరిశోధక నౌక.. ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ తమ దేశ తీరంలో ఆగడానికి అనుమతించారు. ఈ నౌక మాల్దీవుల రాజధాని మాలే తీరానికి చేరినట్లు ధ్రువీకరిస్తూ మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. సిబ్బంది రాకపోకలు, భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థన చేసిందని ఈ మేరకు మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది.
అయితే గతంలో ఇలాగే చైనా నౌక ఒకటి శ్రీలంక తీరంలో లంగరేసి భారత క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకా నిర్మాణ కేంద్రాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాలపై నిఘా కన్నేసిందని వార్తలు వచ్చాయి. అప్పట్లో భారత్.. తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. అయితే శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్షే కూడా చైనా అనుకూలుడు. ఈ విషయంలో ఆయన భారత్ అభ్యంతరాలను పట్టించుకోలేదు.
ఇప్పుడు శ్రీలంక చేసినట్టే భారత్ కు అతి సమీపంలోని పొరుగుదేశం మాల్దీవులు కూడా చేస్తుండటం గమనార్హం. తమతో స్నేహంగా ఉండే పలు దేశాలకు చెందిన నౌకలకు మాల్దీవులు ఓ గమ్యస్థానమని ఆ దేశం చెబుతుండటం గమనార్హం. తాము ఎప్పుడైనా ఆ దేశాల నౌకలకు స్వాగతం చెబుతామని మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించింది. మాల్దీవుల తీరంలోకి తమ దేశం పరిశోధక నౌక వస్తున్నట్లు చైనా సమాచారం అందించిందని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా తమ దేశ నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి మాల్దీవుల దౌత్యపరమైన అనుమతి తీసుకుందని తెలిపింది.
అయితే చైనా పరిశోధక నౌక.. నిఘా సమాచారాన్ని సేకరించే సాధనాలను కలిగి ఉంటుందని భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఇటువంటి పరిశోధ నౌకలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవని సమాచారం. అందుకే భారత్.. చైనా నౌకలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.