వైసీపీలో విష్ణు మౌనం.. దేనికి సంకేతం... !
అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇతర నేతలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినా.. మల్లాదికి మాత్రం అసలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ సామాజిక వర్గం నాయకుడు మల్లాది విష్ణు కొన్నాళ్లు గా మౌనంగా ఉంటున్నారు. ఆయన వైసీపీ హయాంలో దూకుడుగా ఉండేవారు. సాక్షి మీడియాలో నిరంతరం చర్చ కు వచ్చేవారు. జగన్‌ను, వైసీపీ సర్కారును కూడా ఆయన సమర్థించేవారు. అదే సమయంలో విపక్షాలపైనా విమర్శలు చేసేవారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇతర నేతలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినా.. మల్లాదికి మాత్రం అసలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు.
విజయవాడ సెంట్రల్‌కు వెస్ట్ నాయకుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును తీసుకువచ్చారు. ఈయనకు సహకరించాలని పార్టీ హైకమాండ్ సూచించింది. అయితే.. ఆయన ఏ మేరకు సహకరించారో.. అందరికీ తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వనప్పుడే.,. మల్లాది అలిగారు. ఇక, టికెట్ కూడా తీసేసిన తర్వాత.. సహకరిస్తారని ఎవరూ అనుకోరు. మొత్తానికి ఎన్నికల్లో వెల్లంపల్లి ఘోర పరాజయం పాలయ్యారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత.. ఇప్పటి వరకు ఎవరికీ రాని మెజారిటీ.. సెంట్రల్లో టీడీపీ నేత బొండా ఉమా దక్కించుకున్నారు.
సో.. దీనిని బట్టి మల్లాది వారు అప్పట్లోనే మౌనంగా ఉన్నారనేది అర్ధం అవుతుంది. ఇక, ఎన్నికలు ముగిసి మూడు నెలలు అయిపోయినా.. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతంగా ఉన్న సెంట్రల్‌లో ఆయ న నిర్మించిన ఆఫీసులు కూడా మునిగిపోయాయి. అయితే.. తన అనుకున్న కొద్దిమంది అనుచరులకు మాత్రమే మల్లాది అభయం ఇచ్చారు. మిగిలిన వారిని అసలు పట్టించుకోలేదు. ఇక, పార్టీ అధినేత జగన్‌కు కూడా ఆయన దూరంగానే ఉంటున్నట్టు సమాచారం.
మొత్తానికి మల్లాది మనసులో అయితే.. ఇంకా కోపం లేదు. ఈ కోపం.. నేరుగా అధినేతపైనే! ఈ విషయంలో ఆయ నకు డౌట్ లేదు. అయితే.. ఇప్పుడే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆయన మనసు మరో పార్టీ వైపు లాగుతున్న ట్టు సంకేతాలు ఇస్తున్నా.. ఆ పార్టీ ఈయనకు చాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పోనీ.,. పిలుస్తున్నపార్టీవైపు వెళ్దామని అనుకున్నా.. మొత్తానికే మైనస్ అయిపోతామన్న ఆవేదన, భయం రెండు ఉన్నాయి. దీంతో మల్లాది ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నారు. భవిష్యత్తును త్వరలోనే చెబుతానని ఆయన తనకు పరిచయం ఉన్న మీడియామిత్రులతో నర్మ గర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిని బట్టి మల్లాది అడుగులు ఎటు పడతాయో చూడాలి.