విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో చేసిన సంచలన మార్పులు.. రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియదు కానీ.. వ్యక్తిగతంగా ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్‌కు మాత్రం చుక్కలు చూపిస్తాయని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా.. ఆయనకు వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోలేకపోయారు. అదేవిధంగా రాజకీయాల్లోనూ పార్టీలను ముందుకు తీసుకు వెళ్లలేక పోయారు.
ఇదే ఇప్పుడు మల్లాదికి సెగ పెట్టింది. వైసీపీలో టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే విష్ణు.. రెండు కూడా ఎమ్మెల్యే విష్ణు.. అన్నట్టుగానే రాజకీయాలు సాగాయి. స్థానిక కేడర్‌ను దూరం పెట్టడం.. ప్రజల నాడిని పట్టుకోలేక పోవడం.. ముఖ్యంగా స్థానికంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అంచనా వేయలేకపోవడం.. వంటివి విష్ణుకుమైనస్‌గా మారాయి. ఇవే ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టాయనడంలో సందేహం లేదు.
ఇక, ఇప్పుడు కూడా.. ఆయన పార్టీలో ఇమడగలిగే పరిస్తితి లేదు. ఎందుకంటే.. పైకి తాము బాగానే ఉన్నా మని చెబుతున్నా.. పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌తో ఆది నుంచివిష్ణు విభేదించా రు. దీంతో ఇద్దరి మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు నేరుగా వెల్లంపల్లికి పార్టీ టికెట్ ఇవ్వడం.. తనను దూరం పెట్టడంతో విష్ణు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఇది ఎంత వరకు విష్ణుకు కలిసి వస్తుందనేది ప్రశ్న.
ఒకప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేడర్ ఉన్న మాట వాస్తవమే. అయితే.. ఇప్పుడు అది పూర్తిగా వైసీపీకి మళ్లింది. కొందరు తటస్థంగా ఉండేవారు. దీంతో.. 2014లో మల్లాది విష్ణు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. అంటే.. అప్పట్లోనే విష్ణు వైపు కాంగ్రెస్ కేడర్ లేకుండా పోయింది. అలాంటిది ఇప్పుడు.. వైసీపీని వదిలేసి వస్తారా? విష్ణు వెంట తిరుగుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.