కాంగ్రెస్ లోకి 30 మంది కార్పొరేటర్లను తానే పంపానన్న మల్లారెడ్డి!

తన మాటలతో తరచూ వార్తల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి.. తాజాగా మరోసారి తన మాటలతో రాజకీయ రచ్చకు తెర తీశారు.

Update: 2024-05-07 05:20 GMT

తన మాటలతో తరచూ వార్తల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి.. తాజాగా మరోసారి తన మాటలతో రాజకీయ రచ్చకు తెర తీశారు. ఇటీవల కాలంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి.. పలువురు కార్పొరేటర్లు పార్టీ మారారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. వారందరిని తానే పంపానని చెబుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్కడ జరుగుతున్న పరిణామాల్ని తనకు తెలియజేయాల్సిందిగా తానే వారిని పంపినట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి తాను కోవర్టులను పంపానని చెప్పిన మల్లారెడ్డి.. తాను పంపిన వారంతా కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల వల్ల తాము ఆ పార్టీలో ఉండలేకపోతున్నామని.. తాము తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేస్తామని చెప్పినట్ుల పేర్కొన్నారు.

తిరిగి పార్టీలోకి వస్తామని చెబుతున్న వారందరిని తాను బుజ్జగిస్తున్నానని.. లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ లోనే ఉంటూ.. అక్కడ జరిగే విషయాల్ని తనకు తెలియజేయాల్సిందిగా చెప్పినట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ గెలుపునకు పని చేయాలని ఆయా కార్పొరేటర్లకు తాను సూచన చేసినట్లుగా తెలిపారు. మెడ మీద తల ఉన్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్న సంగతి తెలిసిందే.

మల్లారెడ్డి చెప్పినట్లు.. ఆయన నిజంగానే కోవర్టులను పంపితే.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోరు. కానీ.. మల్లారెడ్డి అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. గందరగోళానికి గురి చేయటం.. లేని అనుమానాల్ని పెంచేందుకు వీలుగా ఈ తరహా మాటల్ని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా.. తాజా వ్యాఖ్యలతో మల్లారెడ్డి తన మార్కును మరోసారి ప్రదర్శించారని చెప్పక తప్పదు. మరి.. ఆయన ప్రస్తావించిన 30 మంది కార్పొరేటర్లు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News