పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవడమంటే ఇదే మల్లన్న!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-21 09:19 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వ్యక్తిగత ఇమేజ్, చరిష్మాతో గెలిచినవారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఒకరు. మేడ్చల్‌ నుంచి గెలిచిన మల్లారెడ్డి తన అల్లుడికి మల్కాజిగిరి సీటు ఇప్పించుకుని గెలిపించుకున్నారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ కళాశాలలు ఉన్న సంగతి లె లిసిందే. అయితే ఈ కళాశాలల నిర్మాణాల్లో పలు అవకతవకలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కలిపేసుకోవడం, అలాగే ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కబ్జా చేశారనే ఆరోపణలు మల్లారెడ్డిపై ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.

వాస్తవానికి కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. చెరువులను కూడా కబ్జా చేశారని విమర్శించారు. టీవీ చానెళ్ల వేదికగా రేవంత్, మల్లారెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది కూడా.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం, స్వయంగా రేవంత్‌ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండటంతో మల్లారెడ్డి అక్రమాలపై విచారణ సాగుతోంది.

అయితే మల్లారెడ్డి మాత్రం తనపై కక్ష సాధిస్తున్నారని.. తనను శానా ఇబ్బంది పెడ్తున్నారు అంటూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాలేజీల అక్రమాలే కాకుండా సికింద్రాబాద్‌ పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో ఉంది.

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల విషయంలో మల్లారెడ్డి.. మరో 15 మంది మధ్య వివాదం నడుస్తోంది. ఆ భూమి తమదేనని మల్లారెడ్డి చెబుతున్నారు. అయితే ఆ రెండున్నరెకరాల భూమిలో 1.11 ఎకరాల భూమి తమదేనని, తలా 400 గజాలు కొన్నామని 15 మంది వ్యక్తులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉందని వారు చెబుతున్నారు. ఈ 15 మందిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కూడా ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పై మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. ఆయనపై మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నన్ను శానా ఇబ్బంది పెడుతున్నరు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సికింద్రాబాద్‌ సుచిత్రాలో ఉన్న తన భూమిని తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కుమార్‌ పై మల్లారెడ్డి మండిపడుతున్నారు. తన భూమికి సంబంధించి తన దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని.. అందుకు తగ్గ ఆధారాలను మల్లారెడ్డి మీడియాకు చూపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని.. ఆయన అపాయింట్మెంట్‌ తీసుకున్నానని మల్లారెడ్డి తెలిపారు.

కాగా 82 సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి తాను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని లక్ష్మణ్‌ చెబుతున్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిశాకే తాము భూమి కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. మరి మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కూడా కలవనుండటంతో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News