‘మామునూర్ ఎయిర్ పోర్ట్ ’ క్రెడిట్ ఎవరిది? ఇప్పుడు ఇదే లొల్లి?

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు ‘మామునూర్ ’ ఎయిర్ పోర్ట్ రావడంలో కీలక పాత్ర పోషించారు. అన్ని అనుమతులు ఇచ్చేశారు.

Update: 2025-03-01 22:30 GMT

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు ‘మామునూర్ ’ ఎయిర్ పోర్ట్ రావడంలో కీలక పాత్ర పోషించారు. అన్ని అనుమతులు ఇచ్చేశారు. తెలంగాణకు తీపి కబురును అందించారు. ఇక వరంగల్ లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ విమానాశ్రయానికి కావాల్సిన భూములు, నిధులను రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా అందజేయడంతో ఈ ఎయిర్ పోర్ట్ పట్టాలెక్కింది. అయితే ఇప్పుడు దీని క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీలు కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. తాంబూలాలు ఇచ్చిన రామ్మోహన్ నాయుడు కు బీజేపీ, కాంగ్రెస్ తన్నుకు చస్తున్న తీరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

మామునూరు ఎయిర్ పోర్టు తమ వల్లే వచ్చిందంటూ తెలంగాణలోని వరంగల్ లో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం ఉదయం ఘనంగా సంబరాలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ శ్రేణులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు మామునూర్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అనూహ్య పరిణామాన్ని తెలుసుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు.

- ఎయిర్ పోర్టు కోసం ఎవరి బాధ్యత ఎంత?

ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని కోరడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ నేపథ్యంలో, మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయి. ఈ సందర్భంలో, బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి..

-రామ్మోహన్ నాయుడు కీలకపాత్ర

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పౌర విమానయాన శాఖ కార్యకలాపాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మామునూరు ఎయిర్ పోర్టు అమలుకు కేంద్రం త్వరితగతిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిపాదనలను ఆయన అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, వాటిని అమలు చేయించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు దక్కాల్సిన క్రెడిట్‌ను బీజేపీ, కాంగ్రెస్ లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాయా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అయితే, ఈ విజయాన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని మానుకుని, ప్రజాసేవకే తమ ప్రాధాన్యాన్ని కేటాయించాలి. ఎయిర్ పోర్టు ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరి కృషిని గుర్తించి అభినందించాలి.

Tags:    

Similar News