రోజాకు రుణం తీరినట్లేనా...వైసీపీకి కొత్త గాలి !
అది కూడా తక్కువ మెజారిటీతోనే ఆమె గట్టెక్కారు. అయినా సరే జగన్ ఆమె కోరిక అయిన మంత్రి పదవిని ఇచ్చి తీర్చారు.;
మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంతో రుణం తీరినట్లేనా అన్న చర్చ జోరుగా సొంత పార్టీలోనే సాగుతోంది. ఆమెకు వైసీపీలో మూడు సార్లు ఇక్కడ టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచారు. అది కూడా తక్కువ మెజారిటీతోనే ఆమె గట్టెక్కారు. అయినా సరే జగన్ ఆమె కోరిక అయిన మంత్రి పదవిని ఇచ్చి తీర్చారు.
వైసీపీలో రోజా చేసిన సేవలకు గానూ పార్టీ కూడా తగిన విధంగానే న్యాయం చేసింది అని అంటున్నారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదని అంతా అనుకున్నారు. మొత్తానికి మొత్తం నియోజకవర్గం వైసీపీ క్యాడర్ ఆమెకు దూరం అయిపోయింది. పార్టీలో మెజారిటీ నేతలు అంతా ఆమెకు టికెట్ వద్దు అన్నారు. అయినా జగన్ ఇచ్చారు. దాంతో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీకి అక్కడ 50 వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది.
ఈ క్రమంలో వైసీపీ ఎత్తిగిల్లాలంటే ఏమి చేయాలన్నది జగన్ ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీ నియోజకవర్గం ఇంచార్జిని మార్చాల్సిందే అన్న డిమాండ్ మీద వైసీపీ అధినాయకత్వం ఇపుడు సీరియస్ గానే ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. దాంతో మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత అయిన గాలి ముద్దు క్రిష్ణమనాయుడు కుటుంబం నుంచి రెండవ కుమారుడు గాలి జగదీష్ తన సొంత అన్న గాలి భాను ప్రకాష్ తో విభేదాలు కొనసాగిస్తున్నారు. గాలి భాను ప్రకాష్ ఎమ్మెల్యే అయినా తమ్ముడు మాత్రం తన రాజకీయం వేరు అని చెప్పేస్తున్నారు.
ఆయన వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. దాంతో ఆయనను వైసీపీలోకి రప్పించి ఫ్యాన్ ని అక్కడ గుర్రున తిప్పాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. గాలి ముద్దు క్రిష్ణమనాయుడు పలుకుబడితో జగదీష్ సొంత కష్టం వైసీపీ బలం అన్నీ కలిస్తే 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా అక్కడా ఎగరేయాలని ఆ పార్టీ చూస్తోంది.
దీంతో గాలి జగదీష్ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. నిజానికి చూస్తే గాలి జగదీష్ చేరిక వైసీపీలో ఎపుడో జరగాల్సి ఉందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద వైసీపీ మాజీ మంత్రి రోజా అధినాయకత్వంతో నేరుగా మాట్లాడి అభ్యంతరం వ్యక్తం చేశారు అని అంటున్నారు.
అయితే ఆమెకు వేరే ఆల్టర్నేటివ్ పోస్టు ఇస్తామని ఆమె సేవలని కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని నచ్చ చెప్పారని అంటున్నారు. అయినా సరే నగరి నియోజకవర్గం తనకు కాకుండా వేరే వారికి చాన్స్ ఇస్తే రోజా ఎలా రియాక్టు అవుతారో చూడాల్సి ఉంది.
అయితే ఎవరు అభ్యంతరం పెట్టినా వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే డెసిషన్ తీసుకుందని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల క్రమంలో రేపో ఎల్లుండో గాలి జగదీష్ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే నగరి నియోజకవర్గంలో కొత్త గాలి వీచడం ఖాయమని అంటున్నారు. దాంతో రోజాకు ఈ నియోజకవర్గంతో రుణం తీరినట్లే అని అంటున్నారు.