ఆ ఎమ్మెల్యేలు.. డమ్మీనా.. టీడీపీలో ఏం జరుగుతోంది..?
అయితే.. అన్ని నియోజ కవర్గాల్లో కాకుండా.. కొన్నింటిలో ఈ పరిస్థితి నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవా నడుస్తుండడం గమనార్హం.;
ఏపీలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న టీడీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు అందరూ దూకుడుగానేఉన్నారా? చంద్రబాబు చెప్పినట్టే పని జరుగుతోందా? నియోజకవర్గాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్నారా? అంటే.. కొన్నికొన్ని నియోజక వర్గాల్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్న సంకేతాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి. టీడీపీ కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడంతో అక్కడ ఇతర సీనియర్ నాయకులు హవా చలాయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే.. అన్ని నియోజ కవర్గాల్లో కాకుండా.. కొన్నింటిలో ఈ పరిస్థితి నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవా నడుస్తుండడం గమనార్హం.
ఇవీ కొన్ని ఉదాహరణలు..
అనంతపురం అర్బన్: ఇక్కడ గెలిచిన నాయకుడు ఒకరు చక్రం తిప్పుతున్న నేత మరొకరు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన హవా కొంత మేరకు మాత్రమే పనిచేస్తోంది. ఇక్కడ జేసీ వర్గమే మళ్లీ పుంజుకుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఏ పని కావాలన్నా.. జేసీ సర్ చెప్పాలన్న మాట వినిపిస్తోంది గత ఎన్నికల్లో దగ్గుబాటికి టికెట్ ఇస్తే.. జేసీ సహకరించని విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏకంగా.. ఆయనను డామినేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం జగ్గయ్యపేట. ఇక్కడ నుంచి శ్రీరాం రాజగోపాల్ ఉరఫ్ శ్రీరాం తాతయ్య విజయం దక్కించుకున్నారు. కానీ, ఇక్కడ ఆయన ఆధిపత్యం పెద్దగా లేదు. సీనియర్ నాయకులు.. కొందరు ఇక్కడ అన్నీ తామై పెత్తనం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయన కూడా ఎవరినీ ఎదిరించకుండా.. వారు చెప్పినట్టే నడుస్తు న్నారు. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిస్థితి డోలాయమానంలో పడింది. అదేసమయంలో అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు ఇక్కడ పనులు చేసుకుంటూ పోతున్నారు.
గుంటూరు తూర్పు: గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. టీడీపీ యువ నాయకుడు నసీర్ అహ్మద్ గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, ఆయన మాట ఎక్కడా వినిపించదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నాయకుడు.. ముస్తాఫా షేక్, ఆయన కుమార్తె చక్రం తిప్పుతున్నారు. ఇది ఒకింత చిత్రంగా అనిపించినా నిజమేనని టీడీపీలోనే నాయకులు చెబుతున్నారు. పైగా.. వారితో నసీర్ కూడా చేతులు కలిపారన్న వాదన కూడా వినిపిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో సీనియర్ల సలహాలు తీసుకుంటున్నానని ఆయన చెబుతున్నా.. టీడీపీ నేతలను ఎందుకు అడగడం లేదన్న చర్చ కూడా ఉంది.
తుని, పుట్టపర్తి: ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. తునిలో యనమల దివ్య విజయం దక్కించుకోగా.. ఇక్కడ ఆమె బయటకు రావడం లేదు. ఆమె తండ్రీ టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణుడే అన్నీ అయి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో దివ్య కన్నా..రామకృష్ణుడి హవానే ఎక్కువగా ఉంది. కేవలం సంతకాలకు మాత్రమే దివ్య పరిమితం అయ్యారు. ఇక, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డే ఇప్పటికీ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆయన కోడలు సింధూర రెడ్డి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆమె కూడా బయటకు రావడం లేదు. అన్నీ మామగారైన రఘునాథరెడ్డి చూస్తున్నారు. సో.. ఇలా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంలో ఉండడం గమనార్హం.