కుంకుమ పువ్వు కన్నీరు.. ఇరాన్ కరెన్సీ పతనం.. ఆర్థిక మంత్రిపై వేటు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట ఏదంటే కుంకుమ పువ్వు.. ఈ పంట భారత్ లో కేవలం కశ్మీర్ లోనే పండుతుంది.;

Update: 2025-03-03 03:37 GMT

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట ఏదంటే కుంకుమ పువ్వు.. ఈ పంట భారత్ లో కేవలం కశ్మీర్ లోనే పండుతుంది. కానీ, ప్రపంచంలో కుంకుమ పువ్వు 90 శాతం పండే దేశం ఏమిటో తెలుసా..? ఇరాన్.. ఒకప్పుడు యూరప్ దేశాల తరహాలో అత్యంత ఆధునికంగా ఉండే ఇరాన్ 1970ల చివరలో వచ్చిన మత విప్లవంతో సంప్రదాయ దేశంగా మారింది.

అమెరికాకు కంట్లో నలుసు..

ఇరాన్ అంటే అమెరికాకు పట్టరాని కోపం. రోగ్ కంట్రీల జాబితాలో దానిని కూడా చేర్చింది అమెరికా. ఇటు ఇరాన్ కూడా అమెరికాను ఆగర్భ శత్రువుగానే చూస్తుంది. చాలా ఏళ్ల నుంచి అమెరికాను ఢీకొడుతోంది కూడా. అయితే, ఇరాన్ కరెన్సీ నానాటికీ పతనం అవుతోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాక ఇరాన్ కరెన్సీ పరిస్థితి మరింత దిగజారింది. కరెన్సీ పతనంపై ఇరాన్ లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆర్థిక శాఖ నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. దీంతో ఇరాన్ ఆర్థికశాఖ మంత్రి అబ్దొల్‌నాజెర్‌ హెమ్మతి ఆదివారం పార్లమెంటులో అభిశంసనకు గురయ్యారు. ఆయనపై పెట్టిన తీర్మానానికి 273 మంది సభ్యుల్లో 182 మంది ఓటేశారు. దీంతో రాజ్యాంగం ప్రకారం.. వెంటనే మంత్రి తొలగింపు అమల్లోకి వచ్చింది.

గత ఏడాది మే నెలలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్థానంలో అధ్యక్షుడిగా మసూద్‌ పెజెష్కియాన్‌ ఎన్నికయ్యారు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది.

అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అమెరికా సహా చాలా దేశాలు ఇరాన్‌ పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా పతనావస్థలో ఉంది. 2015లో అమెరికాతో చారిత్రక అణు ఒప్పందం చేసుకునే సమయానికి డాలర్‌ కు ఇరాన్ కరెన్సీ 32వేల రియాల్స్‌ ఉండేది. కొంతకాలంగా దాని విలువ భారీగా క్షీణిస్తూ వస్తోంది. జూలైలో పెజెష్కియాన్‌ అధ్యక్షుడు అయ్యేప్పటికి 5.84 లక్షల రియాల్స్‌కు, అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత 7.03 లక్షలకు, తాజాగా దాదాపు 9.30లక్షల రియాల్స్‌కు పడిపోయింది.

Tags:    

Similar News