రాజకీయాలకు దూరమన్నారు.. ‘విజయసాయి’ ఇలా ఆశ్చర్యపరిచారు!

వైసీపీలో అధినేత వైఎస్ జగన్ తర్వాత నంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవలే అర్ధాంతరంగా పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైదొలగడం అందరినీ షాక్ కు గురి చేసింది.;

Update: 2025-03-03 04:09 GMT

‘ఊరికే రారు మహానుభావులు’ అని.. రాజకీయల్లో ఆరితేరిన గండరగండరులు ఏదీ చేసినా విచిత్రమే.. అందులో అర్థం పరమార్థం ఉంటుందని అంటారు.. ఇప్పుడు వైసీపీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆ పార్టీ ఒకప్పటి నంబర్ 2 నేత విజయసాయిరెడ్డి మరోసారి తన చర్యలతో రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచారు. ‘రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. ఇక నాకు నచ్చిన వ్యవసాయం చేసుకుంటాను’ అంటూ ఫాంహౌస్ లో ఫొటోలు దిగి వైదొలిగిన విజయసాయిరెడ్డి ఎవ్వరూ ఊహించని విధంగా ఉపరాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయనను టీడీపీ ఎంపీతో కలిసి స్వాగతించడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.

వైసీపీలో అధినేత వైఎస్ జగన్ తర్వాత నంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవలే అర్ధాంతరంగా పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైదొలగడం అందరినీ షాక్ కు గురి చేసింది. రాజకీయాలకు ఇక దూరం అని ప్రత్యర్థులందరినీ ప్రస్తావించి రాగద్వేషాలకు అతీతంగా ఉంటానంటూ ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. అన్నట్టుగానే గత కొన్ని వారాలుగా రాజకీయ రంగంలో కనిపించలేదు.

అయితే విజయసాయిరెడ్డి ఈరోజు ఆకస్మికంగా దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే కొద్దిమంది సభ్యుల్లో విజయ సాయిరెడ్డి కూడా ఉండటం విశేషం. ఈ మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలానికి చేరుకుని ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు.

తెలుగు దేశం రాజ్యసభ సభ్యుడు సాన సతీశ్ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొనగా.. విజయ సాయిరెడ్డి అతని పక్కనే నిలబడి ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... విజయ సాయిరెడ్డికి ఈ సమావేశంలో పాల్గొనే అనుమతి ఎలా లభించింది అన్నదే. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తరువాత ప్రోటోకాల్ హక్కులు ఇప్పుడు లేవు. అయితే, ఇప్పుడెలా ఆయన ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికే అధికారిక సమావేశంలో హాజరయ్యారు? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న విషయం.

రాజకీయాలకు వీడ్కోలు చెప్పినట్టు ప్రకటించిన అనంతరం.. ఈ విధంగా హై ప్రొటోకాల్ కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి ఆకస్మికంగా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News