10 కేజీల బంగారంతో జంప్ అయిన మణప్పురం లేడీ బ్రాంచ్ మేనేజర్
మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సంస్థలో బంగారాన్ని కుదవ పెట్టుకొని వడ్డీకి డబ్బులు ఇవ్వటంతో.. ఈ సంస్థకు చెందిన కార్యాలయాల్ని ఏదో రీతిలో దొంగలు టార్గెట్ చేస్తుంటారు. తాజాగా.. ఈ సంస్థకు చెందిన బ్రాంచ్ లో ఒక లేడీ మేనేజర్ కన్నేయటం.. తన బాయ్ ఫ్రెండ్ తో ప్లాన్ చేసి.. దోచేసిన వైనం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే.
కంకిపాడులోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు రెడ్డి వెంకట పావని. గుడివాడ రూరల్ ప్రాంతానికిచెందిన ఆమె.. గత ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచ్ కు మేనేజర్ గా బదిలీ మీద వచ్చారు. భర్తతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటోంది. ఇదిలా ఉంటే.. కొద్దికాలంగా ఒక ప్రైవేటు స్కూల్ ను నిర్వహించే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది.
వీరిద్దరికి అప్పులు ఎక్కువగా ఉండటం.. విలాసవంతమైన జీవితాన్ని గడిపే విషయంలో వీరుకున్న ఆసక్తులు తప్పుడు పనులు చేసేలా చేశాయి. ఈ నెల 16న ఆమె బ్రాంచ్ లోని బంగారాన్ని టార్గెట్ చేసి 10.66 కేజీల బంగారాన్నిదోచేసింది. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి.. కొద్దిసామాన్లను తీసుకొని సన్నిహితుడితో కారులో జంప్ అయ్యారు.
కొంత ప్రయాణం తర్వాత.. బాయ్ ఫ్రెండ్ కు కొంత బంగారాన్ని ఇచ్చి.. మిగిలిన బంగారాన్ని తీసుకొని షిర్డీకి వెళుతున్న తన బంధువులతో కలిసి వెళ్లారు. మరోవైపు బ్రాంచ్ లోని బంగారాన్ని పెద్ద ఎత్తున తీసుకొని జంప్ అయిన లేడీ బ్రాంచ్ మేనేజర్ ఇష్యూ పోలీసులకు వెళ్లటం.. వారు రంగంలోకి దిగి..పావని ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదే సమయంలో బంధువుల ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్న వైనాన్ని గుర్తించి.. ఆమె ఆచూకీని కనుగొన్నారు. ఆమె షిర్డిలో ఉన్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక టీంలు అక్కడకు వెళ్లి.. ఆమెను పట్టుకున్నారు. తాజాగా ఆమెను కంకిపాడుకు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం పావనిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.