టెన్నిస్ గ్రేట్ నాదల్.. మన అనంతపురంలో స్కూల్ ఫౌండర్
స్పెయిన్ బుల్ గా అందరూ పిలుచుకునే గొప్ప క్రీడాకారుడు.
22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు.. టెన్నిస్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్.. ఎక్కడో స్పెయిన్ దేశం.. అలాంటివాడికి ఆంధ్రప్రదేశ్ తో ఏం సంబంధం..? కనీసం భారత దేశం ఎలా ఉంటుందో కూడా తెలియని పాశ్చాత్య దేశానికి చెందిన వాడికి.. మన దేశంలోని ఓ జిల్లాతో అనుబంధం ఎలా ఏర్పడింది? భారత దేశంలోని ఓ మారుమూల జిల్లాకు.. కరువు జిల్లాలో పర్యటించాడు.. అతడెవరో కాదు.. రఫెల్ నాదల్. స్పెయిన్ బుల్ గా అందరూ పిలుచుకునే గొప్ప క్రీడాకారుడు.
ధనాధన్ నాదల్.. సేవా గుణంలో మిన్న
నాదల్ అంటే అందరికీ అతడి దూకుడైన ఆటనే గుర్తొస్తుంది. కానీ, నాదల్ ది వ్యక్తిగతంగా చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు. అత్యంత సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడు. భారీ భద్రత వంటివి లేకుండానే బయటకు వెళ్తాడు. ఇక మైదానంలో ప్రత్యర్థులను కవ్వించడం, దూషించడం
అతడికి తెలియదు. కాగా, నాదల్ తన సంపాదనతో తనపేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. పేద పిల్లలు, ప్రతిభావంతులకు క్రీడలు, చదువులో సాయం చేస్తున్నాడు. అందుకే.. ఆటతీరు, వ్యక్తిత్వంతో టెన్నిస్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాదల్ లాంటి ఆటగాడు మరొకరు రాలేరని అంటారు.
మన అనంతపురంలోనే తొలి స్కూల్..
టెన్నిస్ లో అద్భుతమైన ఫామ్ లో ఉండగానే.. 14 ఏళ్ల కిందట 2010లో అనంతపురంలో నాదల్ ఎడ్యుకేషనల్ టెన్నిస్ స్కూల్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కొందరు పిల్లలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇలా నాదల్ కు ఆంధ్రప్రదేశ్ తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నాదల్ ఫౌండేషన్ పూర్తి పేరు రఫా నాదల్ ఫౌండేషన్. దీంతో అనంతపురంలో రఫా నాదల్ ఎడ్యుకేషనల్ అండ్ టెన్నిస్ స్కూల్ ను స్థాపించాడు. విశేషం ఏమంటే.
నాదల్ ఫౌండేషన్ కింద ఇది మొదటి పాఠశాల. 14 సంవత్సరాలుగా ఈ పాఠశాల టెన్నిస్, చదువులో తర్ఫీదు ఇస్తోంది.
అనంతపురంలో అడుగుపెట్టాడు
నాదల్ అనంతపురం వచ్చాడు. ఇక్కడి పాఠశాల పిల్లలతో సంభాషించాడు. వారితో కలిసి టెన్నిస్ ఆడాడు. కాగా, వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ తో నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్ కు దూరం కానున్నాడు. బహుశా ఆ తర్వాత భారత దేశం లోని తన పాఠశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తాడేమో..?
ఆర్డీటీ చొరవతో..
కరువు నేల అనంతపురంలో కొన్ని దశాబ్దాల కిందట రూరల్ ట్రస్ట్ డెవలప్ మెంట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మొదలు పెట్టింది. స్పెయిన్ నుంచి వచ్చిన మాంచో ఫెర్రర్ కుటుంబం దీనికి పురుడు పోసింది. ఎన్నో కష్టాలను ఓర్చి ఫెర్రర్ కుటుంబం ఆర్డీటీ ద్వారా సేవలందిస్తోంది. మాంచో ఫెర్రర్ అనంతపురం అమ్మాయినే వివాహం ఆడారు. కాగా, తమ దేశానికే చెందిన నాదల్ ను మాంచో ఫెర్రర్ అనంతపురం రప్పించారు. అకాడమీ పెట్టేలా చూశారు.