మంద క్రిష్ణ రాజకీయ అరంగేట్రం ఆ పార్టీ నుంచే ?
దాన్ని ఉమ్మడి ఏపీ అంతటా విస్తరింపచేసి మూడుదశాబదాల పాటు ఏక బిగిన కొనసాగించిన ఘనత మంద క్రిష్ణకే దక్కుతుంది.
దాదాపుగా మూడు దశాబ్దాల పాటు మంద క్రిష్ణ మాదిగ సామాజిక ఉద్యమం నడిపారు. ఎస్సీల వర్గీకరణ అన్నది అసాధ్యమైన విషయం అని మొదట్లో అంతా అనుకున్నారు. అయితే అది సుసాధ్యమని మంద క్రిష్ణ మాదిగ నిరూపించారు. ఆయన ఏపీలో చిన్నగా ప్రారంభం అయిన మాదిగ ఉద్యమాన్ని తెలంగాణా నుంచి అందుకున్నారు. వరంగల్ జిల్లా శాయంపేట లో పుట్టిన మంద క్రిష్ణ 1994లో ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఈదుమూడిలో అప్పట్లో మాదిగలకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదని దండోరా ఉద్యమం మొదలైంది. దాన్ని ఉమ్మడి ఏపీ అంతటా విస్తరింపచేసి మూడుదశాబదాల పాటు ఏక బిగిన కొనసాగించిన ఘనత మంద క్రిష్ణకే దక్కుతుంది.
ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్న దానిని ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో ప్రతీ పల్లె తిరిగి సామాజిక ఉద్యమానికి ఊపిరి పోశారు. చాలా తక్కువ కాలంలోనే ఇది మహోద్యమంగా మారింది. మాదిగల అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం వంటి నినాదాలు చేసుకుని ఈ ఉద్యమం బలంగా వేళ్లూనుకుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువగా మాలలకే అందుతున్నాయని మాదిగిలతో పాటు ఉప కులాలు అణగారిపోతున్నారని ఎంఆర్పీఎస్ బలంగా వాదించి సామాజిక ఉద్యమ పరంగా సక్సెస్ అయింది. ఉమ్మడి ఏపీలో చూసుకుంటే జనాభా పరంగా మాదిగలు డెబ్భై శాతం ఉన్న మాదిగలు ఇతర ఉప కులాలకు రిజర్వేషన్లు ఫలాలు కేవలం పది శాతం దక్కితే 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం దక్కుతున్నాయని మాదిగల ఆందోళనకు మంద క్రిష్ణ అద్దం పట్టారు.
బీసీలలో ఏబీసీడీ ప్రాతిపదికన ఎస్సీలలో సైతం వర్గీకరణ ఎందుకు చేసి అన్ని ఉప కులాలకూ న్యాయం చేయరాదో చెప్పాలని ఎమ్మార్పీస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. బీసీలకు వర్గీకరణ ఉన్నా వారంతా ఐక్యంగానే ఉన్నారని ఎస్సీలలో వర్గీకరణ జరిగితే వారు ఎందుకు చీలిపోతారు అంటూ మాదిగలు ప్రశ్నించడం ఆరంభించారు.
మంద క్రిష్ణ చేసిన ఉద్యమం వల్ల మాదిగలతో పాటు మరిన్ని ఉప కులాలకు కూడా బాగుపడే అవకాశం వచ్చింది అని అంటున్నారు. ఎస్సీలలో మాదిగల కంటే వెనుకబడిన వారు కూడా ఉన్నారు. రెల్లి, పైడి, పాకితో పాటు చాలా ఉపకులాలు ఉన్నాయి. వీరంతా ఈ దేశంలో గడచిన ఏడున్నర దశాబ్దాలుగా రిజర్వేషన్ ఫలాలు ఏ మాత్రం పొంద లేదని అంటున్నారు. అందువల్ల ఈ వర్గీకరణ దాని వల్ల వచ్చే ఫలాలను రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఆయా ఉప కులాలకు కూడా ఇవ్వాలని అంటున్నారు.
మొత్తానికి మంద క్రిష్ణ ఉద్యమానికి మొదట రాజకీయంగా అండదండలు ఇచ్చింది ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన వర్గీకరణ చేశారు. ఆ తరువాత అది న్యాయ సమీక్షకు నిలబడలేదు. అయితే నిరంతరం పోరాటాల ఫలితంగా మంద క్రిష్ణ ఇపుడు విజయం సాధించారు. తెలంగాణాలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకుని తమ ఉద్యమ గొంతుని వినిపించారు ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది.
ఆ తరువాత సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఇపుడు మంద క్రిష్ణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తన ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక తెలంగాణాలో చూస్తే మాదిగల సంఖ్య ఎక్కువ. బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. దాంతో మంద క్రిష్ణ మాదిగను బీజేపీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఆయన కూడా సామాజిక ఉద్యమ అవతారం నుంచి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు.
నిజానికి ఆయన గతంలో మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించారు కానీ అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇపుడు మాదిగల విషయంలో కేంద్రం అండగా ఉండడంతో ఆ వైపుగా మంద క్రిష్ణ చూస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ కూడా రాజకీయంగా సామాజికంగా బలపడాలని తెలంగాణాలో చూస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో మంద క్రిష్ణ తొందరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అని అంటున్నారు. ఆయన రాజకీయ అదృష్టం బాగుంటే బీజేపీలో కీలక నేతగా ఎదిగి తెలంగాణాలో బీజేపీ వస్తే కీలకంగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.