మణిపూర్ లో మరో ఇద్దరిపైనా గ్యాంగ్ రేప్.. తాజాగా మరో దారుణం బయటకు!

దేశ ప్రజలకు షాకింగ్ గా మారిన మణిపూర్ మారణకాండకు సంబంధించి వస్తున్నకొత్త నిజాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్న ఉదంతాల్ని చూస్తే.. మరెన్ని అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Update: 2023-07-23 04:28 GMT

దేశ ప్రజలకు షాకింగ్ గా మారిన మణిపూర్ మారణకాండకు సంబంధించి వస్తున్నకొత్త నిజాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్న ఉదంతాల్ని చూస్తే.. మరెన్ని అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ముగ్గురు మహిళల్ని వివస్త్రల్ని చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లి ఇద్దరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం చోటు చేసుకున్న మే 4నే.. ఈ భయానక ఘటన జరిగిన ప్రాంతానికి సరిగ్గా 40కి.మీ. దూరంలోనే మరో దారుణ గ్యాంగ్ రేప్ జరిగిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

కుకి - జోమి తెగకు చెందిన ఇద్దరు యువతులు కార్ల షోరూంలో పని చేస్తుంటారు. వారిద్దరి వయసు 21, 24 ఏళ్లుగా చెబుతున్నారు. మే నాలుగున వారు కార్లను కడుగుతుండగా.. అల్లరి మూకలు అక్కడకు వచ్చాయి. దౌర్జన్యంగా ఇద్దరు యువతులను పక్కనున్న గదిలోకి తీసుకెళ్లారు. వారు అరవకుండా ఉండేందుకు నోటికి గుడ్డలు కట్టేశారు. అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతులను పక్కనే ఉన్న రంపం మిల్లులోకి లాగి పడేశారు. రంపాల మీద వారిని పడేయటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడిపోగా.. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు వంద-రెండు వందల మంది దుండగులు రాక్షసంగా తమ కుమార్తెను.. ఆమె స్నేహితురాలిని అత్యాచారం చేసి.. హింసించి చంపేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదు. ఈ దారుణ ఘటనకు కొనసాగింపుగా మరో అమానవీయమైన ఉదంతం వెలుగు చూసింది.

ఇంఫాల్ కు 45 కిలోమీటర్ల దూరంలోని సేరో గ్రామంలో కొందరు దుండగులు 80 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి నిప్పు పెట్టారు. ఆమె ఒక స్వాతంత్య్ర సమరయోధుడి సతీమణి. మే 28న జరిగిన ఈ ఉదంతంలో మరణించిన పెద్ద వయస్కురాలిని 80 ఏళ్ల ఇబెటోంబీగా గుర్తించారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పిన సందర్భంలో పెద్ద వయసు కారణంగా బయటకు రాలేకపోయారని.. దీంతో ఆమె బయటకు రాలేక సజీవ దహనమైనట్లుగా పేర్కొన్నారు. ఆమె భర్త చురాచంద్ సింగ్ స్వాతంత్య్ర సమరయోధుడు.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లుగా చెబుతున్నారు.

Similar News