ట్రంప్ పై హత్యాయత్నం.. కుటుంబాన్ని కాపాడుకుని మృత్యు ఒడికి!
వచ్చే ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే
వచ్చే ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి ఆయన రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ప్రచారంలో ఉన్న ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఆయన చెవికి తీవ్ర గాయాలయిన సంగతి విదితమే. ఈ ఘటనలో తృటిలో ట్రంప్ ప్రాణాలతో బయటపడగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.
కాగా డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో మృత్యువాత పడ్డ వ్యక్తిని 50 ఏళ్ల కోరే కాంపెరెటోర్ గా పోలీసులు నిర్ధారించారు. అతడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చాడని చెబుతున్నారు. దుండగుడు కాల్పులు జరుపుతున్న సమయంలో బుల్లెట్ ఎక్కడ తన కుటుంబానికి తగులుతుందోనని భావించిన కోరే కాంపెరెటోర్ ముందుకు దూకాడు. దీంతో బుల్లెట్ అతడికి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుటుంబానికి ఏమీ కాకుండా అతడు రక్షించుకోగలిగాడు. అందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు.
ట్రంప్ హత్యాయత్నం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కోరె కాంపెరెటోర్ బట్లర్ పట్టణానికి సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయన ట్రంప్ కు మద్దతుదారు. అతడు ఒక ప్లాస్టిక్ తయారీ కంపెనీలో ప్రాజెక్టు, టూలింగ్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అంతకాకుండా ఫైర్ పైటర్ గా స్వచ్చంధ సేవలు అందిస్తున్నాడని వెల్లడైంది.
ఈ నేపథ్యంలో మృతుడు కోరె కాంపెరెటోర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గొప్ప సాహసం చేశాడని అందరూ చెబుతున్నారు. కోరె మృతిపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాప్రియో సైతం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అతడిని హీరోగా కొనియాడారు.
కాగా మృతుడు కోరె కాంపెరెటోర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని.. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారని పెన్సిల్వేనియా గవర్నర్ తెలిపారు. కోరె భార్య, పిల్లలతో తాను మాట్లాడానని, తన సానుభూతిని తెలిపినట్టు వెల్లడించారు.
కాగా కాల్పుల ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు.. డేవిడ్ డచ్, జేమ్స్ కోపెన్ హేవర్ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది.