చరిత్రలో ఒక పేజీ...ముందే ఊహించిన మౌన ముని
నడుస్తున్న కాలంలో ఎవరూ కూడా ఒకరిని జడ్జి చేయలేరు. వర్తమానంలో సమకాలీనుల మద్దతు కూడగట్టడం కష్టం కూడా.
నడుస్తున్న కాలంలో ఎవరూ కూడా ఒకరిని జడ్జి చేయలేరు. వర్తమానంలో సమకాలీనుల మద్దతు కూడగట్టడం కష్టం కూడా. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. మరో వైపు చూస్తే మరో వర్గం కీర్తనలు కూడా ఉంటాయి. వాటికి కూడా విలువ ఎంతో తెలియదు.
కానీ కాలం సుదీర్ఘమైనది. అది అత్యంత కఠినమైనది కూడా. అది ఇచ్చే తీర్పు విశిష్టమైనది. దానికి రాగద్వేషాలు లేవు. తన వారూ పరవారు అన్న తేడా లేదు. అందుకే కాలం మన్మోహన్ అనే ఒక మాజీ ప్రధానికి చరిత్రలో ఒకే పేజీని కేటాయించింది.
మన్మోహన్ స్థానం అక్కడ సుస్థిరం, శాశ్వతం కూడా. ఇదంతా ఎందుకు అంటే మన్మోహన్ దేశానికి వరసగా రెండు పర్యాయాలు వంతున పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. ఆయన అంతకు ముందు 90 దశకంలో దేశానికి ఆర్ధిక మంత్రిగా ఒక సంక్లిష్టమైన పరిస్థితులలో పనిచేసి దేశానికి ఆర్థిక జవసత్వాలు అందించారు
ఆయన 2014లో ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. సరిగ్గా పదేళ్ల తరువాత ఆయన ఈ భువి నుంచి దివికేగారు. అయితే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానిగా పదేళ్ల పాటు ఈ భూమి మీద నడయాడినా ఆయన గొప్పతనం గురించి మాత్రం ఎవరూ అంతగా ప్రస్తావించుకోలేదు.
ఆయన అన్న వారు లేకుంటే ఈ దేశం ఆర్ధిక గమనం ఎలా ఉండేదో అన్నది కూడా ఆలోచించలేదు. ఆయనను ఒక మాజీ ప్రధానిగానే చూశారు. ఆయన మౌన ముని కాబట్టి తన పని తాను చేశారు. వర్తమానంతో పని లేదు, రాజకీయ పక్షాలు కానీ మీడియా కానీ ఎవరూ తన పని గురించి గుర్తించి చర్చించకపోయినా ఫరవాలేదు, కానీ కాల పరీక్షలో తాను కచ్చితంగా నెగ్గుతాను అన్న నమ్మకం అయితే మన్మోహన్ సింగ్ కి ఉండేది. అదే ఆయన ఒకటి రెండు సందర్భాలలో వ్యక్తం చేశారు కూడా.
అది ఇపుడు నిజం అయింది. నిన్నటిదాకా మన మధ్యన ఉన్నది ఒక గొప్ప నాయకుడు అన్నది కాలం చెప్పింది. అది కూడా మన్మోహన్ కాలం తీరాక తెలిసింది. చరిత్ర ఆయన కోసం ఒక బంగారు పేజీని అచ్చేసి ఉంచిందని కూడా తెలిసింది. ఇపుడు అంతా ఆయన గురించి చెబుతూ ఉంటే అయ్యో ఇంతటి మహనీయుడు మన మధ్య ఉన్నారా అని అందరూ ఆలోచిస్తున్నారు. అవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు.
నిజమే కదా. భారత్ ని ఆర్ధికంగా నిలబెట్టిన మేధో సంపత్తి ఆయన సొంతం కదా. ఆల్ టైం రికార్డు గా జీడీపీ ఆయన టైం లో 10.8 శాతం ఉన్నది ఒక రికార్డు కదా. దేశం ఈ రోజున ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది కూడా వాస్తవమే కదా. రానున్న కాలంలో ప్రపంచంలో మరే దేశమూ దూసుకుని పోలేనంత వేగంగా ఆర్థిక గమనంతో భారత్ ముందుకు పోతుంది అన్నది కూడా నిజమే కదా.
మరి ఇన్ని చేసిన మన్మోహన్ సింగ్ ని చరిత్ర ఎలా పట్టించుకోకుండా ఉంటుంది. అందుకే ఆయనకు అగ్ర తాంబూలం ఇస్తోంది. ప్రపంచ దేశాల నేతలు కూడా మన్మోహన్ సింగ్ ని వేయి నోళ్లతో కొనియాడుతున్నారు. ఆయనే అసలైన భరత మత ముద్దు బిడ్డ అంటున్నారు.
మన్మోహన్ తన గురించి ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. తానే ఈ దేశానికి ఆర్ధిక బలాన్ని ఇచ్చానని జబ్బలు చరచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు. కాలం గొప్పదని, అది తనను గుర్తిస్తుందని. తాను ఉన్నా లేకపోయినా తాను చేసిన పనుల ద్వారా తనకు చిర కీర్తి దక్కుతుందని. అదే ఈ రోజు నిజం అయింది. భారతదేశాన్ని పాలించిన అత్యుత్తమ ప్రధానులలో మన్మోహన్ కి ముందు వరసలో చోటు ఉంది. ఆయనకు చరిత్రలోనూ ఒక పేజీ కచ్చితంగా ఉంది.