మహారాష్ట్ర ఎన్నికలను శాసించనున్న ‘మరాఠా’ బక్క మనిషి
ఇదంతా ఒక బక్క పలచటి మనిషి ప్రభావం.. రెండు జాతీయ పార్టీలు, నాలుగు ప్రాంతీయ పార్టీల సమరం అయిన మహారాష్ట్రలో ఇప్పుడు ఆయనదే హవా
ఆయనేమీ ఆజానుబాహుడు కాదు.. అంతకుమించి చూడగానే ఆకట్టుకునే రూపమూ కాదు.. అసలు మొన్నటివరకు బయటి ప్రపంచానికే తెలియదు.. కానీ.. ఇప్పుడు మాత్రం రాజకీయ పార్టీలకు చాలా కావాల్సినవారు అయ్యారు.. ఆయన కంట్లో పడితే చాలు అన్నంతగా పార్టీలు ప్రసన్నం చేసుకుంటున్నాయి.. ఆయన తమ గురించి మాట చెబితే చాలు అని వెంపర్లాడుతున్నాయి. ఇదంతా ఒక బక్క పలచటి మనిషి ప్రభావం.. రెండు జాతీయ పార్టీలు, నాలుగు ప్రాంతీయ పార్టీల సమరం అయిన మహారాష్ట్రలో ఇప్పుడు ఆయనదే హవా..
మరాఠా కోటాతో..
కొంత కాలం కిందట మహారాష్ట్రలో మరాఠా కోటా ఉద్యమం ఎంత తీవ్రంగా సాగిందో అందరూ చూశారు. అప్పటికి ఏదో సర్దిచెప్పారు కానీ.. అత్యంత కీలకమైన ఎన్నికల ముందు మాత్రం ఆ ఉద్యమం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ సమయం రానే వచ్చింది. పార్టీలన్నీ ఒక వ్యక్తి మద్దతు కోసం పోటీ పడుతున్నయి. ఆయనే.. మనోజ్ జరాంగే పాటిల్. సరిగ్గా ఏడాది కిందటి వరకు ఈయన ఎవరో పెద్దగా బయటివారికి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ, ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఎందుకంటే.. మరాఠా వర్గానికి రిజర్వేషన్ల ఉద్యమం వెనుక ఉన్నది ఈయనే కాబట్టి.
మరఠ్వాడా యోధుడు..
ఇప్పటివరకు మనకు మరాఠా యోధుడు అంటే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాత్రమే. కానీ, మున్ముందు జరాంగే పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కోరుతూ కొద్దికాలం కిందట మహారాష్ట్రలో పెద్దఎత్తున సాగిన ఉద్యమానికి ఈయనే సారథ్యం వహించారు. చూసేందుకు సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు జరాంగే. మరాఠ్వాడా ప్రాంతంలోని జాల్నా జిల్లా అంతర్వాలి సరాటీకి చెందిన జరాంగే.. మరాఠాల కీలక నాయకుడిగా ఎదిగారు. సరాటీలో ఆయన మొదలుపెట్టిన ఉద్యమం కొన్ని రోజుల్లోనే మహారాష్ట్ర అంతటా పాకింది. హింస చెలరేగినా.. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. జరాంగేతో చర్చలు జరిపింది.
దీక్షలే దీక్షలు.. ఎన్డీఏ కూటమికి దెబ్బలు
జరాంగే సాధారణ వ్యక్తిలా కనిపించినా ఆయనలో గట్టి ఉద్యమకారుడు ఉన్నారు. నిరుడు సెప్టెంబరు నుంచి ఆయన ఆరుసార్లు నిరాహార దీక్షకు దిగడమే దీనికి నిదర్శనం. జరాంగే దెబ్బతోనే.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ (మహాయుతి) కూటమికి ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో 48 స్థానాలకు గాను కాంగ్రెస్-ఎన్సీపీ (శరద్ పవార్)-శివసేన (ఉద్ధవ్)లతో కూడిన మహా వికాస్ అఘాఢీ కూటమి 30 సీట్లు నెగ్గింది. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో మరఠ్వాడాలో సీట్లన్న బీజేపీనే నెగ్గింది. కానీ, ఈసారి విఫలమైంది. దీనికి కారణం జరాంగేనే. అందుకే ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఉదయ్ సామంత్ సరాటీకి వచ్చి జరాంగేతో భేటీ అయ్యారు. మంత్రి అబ్దుల్ సత్తార్ కూడా సమావేశం అయ్యారు. ఇక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చౌవాన్, ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ ముఖ్ కూడా జరాంగేతో వేర్వేరుగా చర్చలు సాగించారు. ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ కూడా కలిశారు. మరాఠాలే కాక ముస్లింల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోవాలని కోరారు.