తలకు పిస్టల్ గురి పెట్టి మరీ షేర్లు రాయించుకున్న రామోజీ?
ఈ కేసులో ఏ1గా రామోజీ రావు.. ఏ2గా శైలజా కిరణ్ లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులోని ముఖ్యమైన అంశాల్ని పరిశీలిస్తే..
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మీద సంచలన ఆరోపణ తెర మీదకు వచ్చింది. మార్గదర్శి షేర్లను తన కోడలి పేరు మీద బదిలీ చేస్తున్నట్లుగా పత్రాల మీద సంతకాలు చేస్తావా? లేదా? అంటూ గదిలో తలకు పిస్టల్ గురి పెట్టి మరీ బెదిరించి సంకతాలు తీసుకున్నట్లుగా ఆయన మీద తాజా ఆరోపణ షాకింగ్ గా మారింది.
మార్గదర్శిని చిట్ ఫండ్స్ ను స్థాపించిన జీజే రెడ్డి కుమారుడు మార్టిన్ రెడ్డి.. యూరి రెడ్డిలను పిస్టల్ తలకు గురి పెట్టి మరీ తన కోడలు శైలజా కిరణ్ పేరు మీద రామోజీరావు అక్రమంగా బదిలీ చేశారంటూ బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈ నెల 13న కంప్లైంట్ చేసిన వైనం వెలుగు చూసింది.
జీజే రెడ్డి పెద్ద కొడుకు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆయన కుటుంబ ఆస్తి వ్యవహారాల్ని చూస్తున్న రెండో కొడుకు యూరి రెడ్డి తాజాగా సీఐడీకి కంప్లైంట్ చేశారు. ప్రాథమిక ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు రామోజీ రావు మీదా శైలజా కిరణ్ మీదా కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. బెదిరించి ఆస్తులను బదిలీ చేసిన ఆరోపణ మీద ఐపీసీ సెక్షన్లు 420, 467, 120బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన వైనం బయటకు వచ్చింది.
ఈ కేసులో ఏ1గా రామోజీ రావు.. ఏ2గా శైలజా కిరణ్ లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులోని ముఖ్యమైన అంశాల్ని పరిశీలిస్తే..
- క్రిష్ణా జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్యను అభ్యసించి ఢిల్లీలో నవభారత్ ఎంటర్ ప్రైజస్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావును తన కంపెనీలో టైపిస్టుగా జాబ్ ఇచ్చారు.
- జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను 1962లో స్టార్ట్ చేవారు. ఆ కంపెనీలు జీజే రెడ్డికి 288షేర్లు ఉన్నాయి. 1985లో జీజే రెడ్డి చెకోస్లోవేకియాలో మరణించారు. ఆయన భార్య 1986లో మరణించారు. అనంతరం వారి ఇద్దరి కుమారులు మార్టిన్.. యూరి రెడ్డిలు మార్గదర్శిలో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీని చాలాసార్లు కలిసినా ఆయనేం చెప్పలేదు.
- మార్గదర్శి చిట్ ఫండ్స్ లో షేర్ల వివరాలు 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలతో తెలుసుకున్న మార్టిన్.. యూరి రెడ్డిలు రెండేళ్ల పాటు ప్రయత్నించి 2016 సెప్టెంబరు 29న రామోజీని కలిశారు.
తమ షేర్లకు సంబంధించిన షేర్ సర్టిఫికేట్లను ఇవ్వాలని కోరగా.. 2007-08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ ను రూ.39.74 లక్షల మొత్తాన్ని యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారు.
మిగిలిన సంవత్సరాల డివిడెండ్ మొత్తాన్ని ఇవ్వాలని కోరగా.. అవన్నీ సెటిల్ చేస్తానని రామోజీ చెప్పారు. ఆ తర్వాత రామోజీ సిబ్బంది మార్టిన్ రెడ్డి.. యూరి రెడ్డిలను ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత రామోజీ ఆ గదిలోకి వచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్ మీద ఉన్నఅఫిడవిట్ మీద మార్టిన్ రెడ్డిని సంతకం చేయమన్నారు.
- అందులో తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరు మీద మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉంది. మరో పోస్ట్డ డేటెడ్ చెక్కు (రూ.2.88లక్షలు) యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్ హెచ్ 4 మీద సంతకం చేయాలని రామోజీ కోరారు. కానీ.. వాటిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి ఒప్పుకోలేదు.
- సంతకం పెట్టేందుకు ఒప్పుకోకపోవటంపై యూరి రెడ్డి.. మార్టిన్ రెడ్డిలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తన వద్ద ఉన్న పిస్టల్ ను తలపైకి గురి పెట్టి బెదిరింపులకు దిగారు. దీంతో ప్రాణభయంతో ఆ పత్రాలపై యూరి రెడ్డి సంతకాలు చేశారు. అనంతరం బయటకు వచ్చారు. పత్రాలపై సంతకం చేసినప్పటికీ రామోజీ ఇచ్చిన చెక్కును వారు క్యాష్ గా మార్చుకోలేదు. షేర్లను బదిలీ చేసుకోవటం తమకు ఇష్టం లేకపోవటమే.
- తాజా పరిణామాల నేపథ్యంలో మార్గదర్శిలో తమకున్న షేర్ల లెక్క తెలుుసుకునేందుకు ప్రయత్నించిన వారికి 288 తమ పేరు మీద ఉండాల్సిన 288 షేర్లు శైలజకిరణ్ పేరు మీద బదిలీ అయినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫోర్జరీ.. బెదిరింపులకు పాల్పడ్డ అంశాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక ఆధారాల్ని సేకరించిన సీఐడీ అధికారులు రామోజీ మీదా.. ఆయన కోడలు శైలజా కిరణ్ మీదా కేసులు నమోదు చేశారు.