ఆ గట్టు మీద చానల్స్ ఈ గట్టు మీదకు రాకూడదంతే...!
పాత తెలుగు సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూదు అని.
పాత తెలుగు సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూదు అని. అలా ఇపుడు ఏపీలో రెండే వర్గాలు, రెండే పార్టీలు, రెండే కుటుంబాలు వాటి మధ్య భీకర రాజకీయ సమరం. అది దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ కి చాన్స్ ఉందో లేదో తెలియదు, అలా తెలుసుకునే రిస్క్ ని ఏ ఒక్క పార్టీ చేయడం లేదు. అందువల్ల 2024 ఎన్నికల్లో పోటీ అధికార వైసీపీ అలాగే టీడీపీ కూటమికే అని చెప్పుకోవాలి.
ఏపీలో రాజకీయం ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అంటే పై నుంచి దిగువ దాకా నిలువునా అంతా విడిపోయారు. ఒకపుడు రాజకీయ పార్టీలను ఆయా నేతలను అభిమానించేవారు ఉండేవారు. వారిలో వారు ఎంత చర్చించుకున్నా వాదించుకున్నా చివరికి మిత్రులుగానే ఉండేవారు. ఇపుడు ఆ పారిస్థితి లేదు. వర్గ శత్రువులుగా మారిపోతున్నారు.
అంతే కాదు ఆఫీసులలో పిచ్చాపాటీ కబుర్లలో దొర్లే రాజకీయాలు సైతం పూర్వంలా ఉండడంలేదు. ఒక పార్టీని అభిమానించేవారు రెండవ పార్టీని అభిమానించే వారిని పూర్తి స్థాయిలో ద్వేషిస్తున్నారు. వారితో మాటలు కూడా కట్ చేసుకుంటున్నారు. ఇక వ్యవస్థలలో ఇలాగే కనిపిస్తోంది. కీలక వ్యవస్థలలో రెండు పార్టీల సానుభూతిపరులు ఉంటున్నారు. వారికీ వీరికీ మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది.
ఇంతటి నిట్టనిలువు చీలిక ఏపీ రాజకీయాల్లో ఇంతకు పూర్వం ఎవరూ చూసి ఉండరు. దాంతో ఏ పార్టీ గురించి ఎవరు ఫేవర్ గా మాట్లాడినా రచ్చ అవుతోంది. రావణ కాష్టం అవుతోంది. ఈ నేపధ్యంలో పాత్రికేయులది కూడా ఒక కష్టతరమైన బాధ్యత. ఫలనా పార్టీకి అనుకూలంగా ఉండే చానల్ కానీ పత్రికలో కానీ పనిచేస్తున్నారు అంటే ఆ పార్టీ వారే అని ఎదుటి పార్టీ నిర్ణయించేసుకుంటోంది.
వారు కూడా తమ పత్రిక అనుకూలం అయిన పార్టీ గొంతుకతోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఆయా చానళ్ళు పత్రికలు బ్యాన్ అని ముఖం మీద చెప్పేస్తున్నారు. అయినా పాత్రికేయ వృత్తి అంటూ కొంతమంది తాము పనిచేసే మీడియాకు ప్రత్యర్ధి పార్టీ రాజకీయ సభలకు వెళ్తున్నారు. అక్కడ వారు చేసే పని వారికి పురమాయించిన పని కూడా ఉన్నంతలో నెగిటివిటీని పోగు చేసి మీడియాకు సరుకుని తీసుకుని రావడమే.
దాంతో వారు చేస్తున్నది ఏంటి అంటే మధ్యాహ్యం మీటింగ్ అయితే ఉదయం కుర్చీలు ఖాళీగా ఉంటే వాటిని ఫోటోలు తీస్తున్నారు. సభలో నుంచి చివరలో వెళ్లేవారు ఉంటే మొదట్లోనే లేచి వెళ్ళిపోతున్నారు అని చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి చోట్ల తమ టాలెంట్ ని ఎడిటింగ్ ని కూడా జోడిస్తున్నారు.
అదే విధంగా ఆయా పార్టీల అధినాయకులు ఫ్లో లో ఏమైనా తప్పు మాట్లాడినా వెంటనే దాన్ని అందిపుచ్చుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అలాగే సోషల్ మీడియాకు చేరవేస్తూ క్షణాలలో వైరల్ చేసి పారేస్తున్నారు. ఇలా రెండు పార్టీలలోనూ ఆయా పార్టీలను అభిమానించే చానళ్ళు మీడియా హౌజ్ లో పనిచేసే వారు చేస్తున్న పని ఎక్కువగా ఇదే ఉంది అని అంటున్నారు.
చిత్రమైన విషయం ఏంటి అంటే ప్రతిపక్ష సమావేశాలకు అధికార పక్షం నుంచి అనుకూలంగా ఉన్న మీడియా హాజరైతే వారిని పిలిచి మరీ మైకుల ద్వారా చెబుతూ ఏమీ అనుకోకండి వెళ్ళిపోండి అంటున్నారు. అలా కాదు కూడదు అని ఉంటే మాత్రం వారి క్యాడర్ బడిత పూజ చేస్తున్నారు. ఇలా మీడియా కూడా ఎపుడో రాజకీయ రంగు పులుముకుంది. ఇపుడు అందులో పనిచేసే వారు కూడా ఆయా పార్టీ సానుభూతిపరులే అన్న భావనకు ప్రత్యర్ధి పార్టీలు వచ్చేస్తున్నాయి.
ఇది దురదృష్టకరం. కానీ పీక్స్ లో సాగుతున్న ఏపీలో వర్గ పోరు కానీ రాజకీయ పోరు కానీ చూస్తే ఇవి ఇలాగే ఉంటాయని అనుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాప్తాడులో ఇటీవల నిర్వహించిన సిద్ధం సభలో ఒక టీడీపీ అనుకూల మీడియా ఫోటోగ్రాఫర్ ని కొట్టారని వార్తలు రావడం వల్లనే.
ఆ మీడియా అధికార పార్టీకి వ్యతిరేకం అని పై స్థాయి నుంచి అంతా చెబుతూ ఉంటారు. ఇక వైసీపీ అధినాయకత్వమే ఆ పత్రికాధిపతులను సభలలో పేరు పెట్టి మరీ విమర్శలు చేస్తుంది. మా సభలకు రావద్దు అని ఆ పార్టీ నేతలు ఎపుడో చెప్పేశారు. అయినా వెళ్తే ఇలాంటివే జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు అంటున్నారు. పది లక్షల జనంతో జరిగే భారీ మీటింగ్ లో మీరు దయచేసి రావద్దు అని ఆయన కొన్ని టీడీపీ అనుకూల మీడియా పేర్లు చెప్పి మరీ స్పష్టం చేశారు.
ఇక ఆయా పత్రికాధిపతులు నేరుగా అక్కడికి వస్తే వారికి కాలూ కీలూ కూడా తమ క్యాడర్ ఊడగొడతారు అంటూ ఆయన మరింత ఆశ్చర్యపరచేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేశారు అని కాదు వాతావరణం అలా ఉంది. టీడీపీ వారు కూడా అధికార పత్రిక అంటూ ఒక పేపర్ ని ఎపుడూ చెబుతూ ఉంటారు. వారిని వీరు కూడా బ్యాన్ చేశారు.
కానీ అక్కడ వ్యతిరేక వార్తలు వండడానికి వీరికి మీడియా ముడి సరుకు కావాలి. అలాగే వారికీ కావాలి. మధ్యలో బలి అయ్యేది అచ్చంగా పాత్రికేయులే. అందుకే కొడాలి నాని చెప్పారని కాదు కానీ ఆ గట్టు మీద మీడియా ఈ గట్టు మీదకు వాలకపోవడమే ఏపీ రాజకీయాలకు మంచిదే. ఇదేమి ప్రజాస్వామ్యం అని ఎవరూ అడగవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనుకుంటూ నేతి బీరకాయలో నేతిని చూసే జనాలు ఇపుడు ఎవరూ లేరు కనుక.