భీమవరంలో రూ.33 కోట్ల బెట్టింగ్... మీడియేటర్ మాయం?
గెలుపోటములమీదే కాకుండా... మెజారిటీ ఓట్లపైన కూడా ఈసారి బెట్టింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ భారీస్థాయిలో బెట్టింగ్ జరిగిందనే వార్తలు ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా ఈసారి భారీ ఎత్తున బెట్టింగ్ జరిగిందని చెబుతున్నారు. గెలుపోటములమీదే కాకుండా... మెజారిటీ ఓట్లపైన కూడా ఈసారి బెట్టింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇవి ఎన్నికలు కాదు.. యుద్ధం అన్న స్థాయిలో జరిగిందనే కామెంట్లూ వినిపించాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు ఒకెత్తు అయితే... ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం, వచ్చే స్థానాలు, మెజార్టీ ఓట్లు, మెజారిటీ సీట్లు.. ఇలా ప్రతీ అంశంపైనా బెట్టింగ్ జరిగిందని అంటున్న పరిస్థితి.
ఇక కొన్ని కీలక ప్రాంతాంలో, మరికొన్ని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో అయితే ఈ బెట్టింగ్ తీవ్ర మతింత ఎక్కువగా జరిగిందని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల పరిస్థితి అయితే చెప్పే పనేలేదు అనేది కామెంట్! ఈ పరిస్థితుల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇందులో భాగంగా బెట్టింగ్ మీడియేటర్ జంప్ అయిపోయాడని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం కేంద్రంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరుగా సాగాయని చెబుతున్నారు. ఈ సమయంలో భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి.. కౌంటింగ్ తర్వాత కనిపించకుండా పోయారనే మాట ఇప్పుడు స్థానికంగా వైరల్ గా మారిందంట.
భీమవరంలో ఓ పెద్ద మనిషిని బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తిగా పెట్టుకున్నారంట. ఇందులో భాగంగా అటు తూర్పు గోదావరి నుంచి, ఇటు పశ్చిమగోదావరి నుంచే కాకుండా... అటు కృష్ణా, గుంటూరు నుంచి కూడా కొంతామంది సదరు మధ్యవర్తి సమక్షంలో సుమారు రూ.33 కోట్ల వరకూ బెట్టింగులు కాశారంట.
దీనికోసం సగటు మధ్యవర్తికి 5% కమీషన్ కూడా సెట్ చేశారంట. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సదరు బెట్టింగ్ మీడియేటర్ కనిపించకుండా పోయాడని అంటున్నారు. దీంతో.. బెట్టింగ్ రాయుళ్లంతా తలలు పట్టుకున్నారని చెబుతున్నారు.