మేడిగడ్డ ముప్పును ఏడాదిన్నర క్రితమే గుర్తించారా?

షాకింగ్ అంశం ఏమంటే..ఆ సమయానికి ప్రాజెక్టు నిర్వహణతో పాటు.. ఏదైనా నష్టం వాటిల్లిన పక్షంలో కాంట్రాక్టు ఏజెన్సీనే బాధ్యత వహించే కాలం.

Update: 2023-12-20 11:30 GMT

షాకింగ్ నిజం బయటకు వచ్చింది. కీలకమైన ఎన్నికలకు కాస్త ముందు.. మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో పియర్స్ ప్రాంతంలో నీటి బుడగలు ఏర్పడటం.. పిల్లర్లు కుంగిన వైనం తెలిసిందే. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టులో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం సంచలనంగా మారింది. దీంతో.. ప్రాజెక్టు నాణ్యత మీద బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంతకూ మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో చోటు చేసుకున్న మార్పుల గురించి అధికారులు ఎలా రియాక్టు అయ్యారు? అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మారిన ప్రభుత్వం.. ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. బ్యారేజీ ఏడో బ్లాకులోని 17, 18, 19, 20 వెంట్స్ దిగువన బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఏర్పడిందని.. దాని నివారణకు చర్యలు తీసుకోవాలని.. దిగువ భాగంలోనే సిమెంటు కాంక్రీట్ బ్లాక్స్ పక్కకు జరిగినట్లుగా ఈ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ గా వ్యవహరించిన ఎల్ అండ్ టీకి ఇరిగేషన్ ఇంజినీర్లు లేఖలు రాసిన వైనం బయటకు వచ్చింది.

ఈ పరిస్థితి ఏప్రిల్ 2022లో చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. షాకింగ్ అంశం ఏమంటే..ఆ సమయానికి ప్రాజెక్టు నిర్వహణతో పాటు.. ఏదైనా నష్టం వాటిల్లిన పక్షంలో కాంట్రాక్టు ఏజెన్సీనే బాధ్యత వహించే కాలం. అలాంటప్పుడు అధికరారులు ఎల్ అండ్ టీ మీద ఒత్తిడి తెచ్చినా.. ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసినా పరిస్థితి మరోలా ఉండేది. అయితే.. కింది స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లో జరుగుతున్న పరిణామాలను పేర్కొంటూ సమాచారం అందించినా.. అత్యున్నత స్థాయిలో అలాంటి తీరు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక్కడో మరో తేడాను గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఓవైపు పెండింగ్ పనులు చేయలేదనిలేఖలు రాసిన ఇంజినీర్లు.. ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసినట్లుగా సర్టిఫికేట్ ఎలా ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసిన తర్వాత రెండేళ్ల వరకు ఏదైనా లోపం జరిగితే బాధ్యత వహించేలా కాంట్రాక్టర్ తో ఒప్పందం ఉంటుంది. ఇలాంటి వేళ.. సదరు కాంట్రాక్టర్ కు లేఖలు రాసేసి వదిలేయకుండా.. వారి మీద ఒత్తిడి తెచ్చి పనులు పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత సీనియర్ అధికారుల మీద ఉంటుంది. అలాంటప్పుడు ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షించే సీనియర్ ఇంజినీర్లు ఈ విసయాన్నిఎందుకు విస్మరించారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

తాజాగా వెలుగు చూసిన వివరాల్ని చూస్తే.. దెబ్బ తిన్న పనుల గురించి లేఖ రాయటంతోపాటు.. వెంటనే పనులు చేయకుంటే బ్యారేజీకి ఎక్కువ నష్టం జరుగుతుందని.. వీటిని సీజన్ లోపు పూర్తి చేయటం కష్టమవుతుందని స్పష్టం చేస్తూ లేఖలు రాశారు. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనుల్లో నాలుగింటిని పేర్కొన్నారు. అవన్నీ కూడా దెబ్బ తిన్నవి.. బాగు చేయాల్సిన అవసరం ఉన్నవే. కానీ.. అదేమీ జరగకపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. మొత్తంగా కింది స్థాయి అధికారులు ముందే గుర్తించిన లోపాన్ని సరి చేసే విషయంలో అటు ప్రభుత్వం కానీ.. ఇటు సీనియర్ అధికారులు కానీ సరైన రీతిలో స్పందించలేదన్నట్లుగా బయటకు వచ్చిన వివరాలు ఉండటం గమనార్హం.

Tags:    

Similar News