మెగా ఫ్యామిలీ అంత చెయ్యకుండా ఉండాల్సిందా?

నిజానికి చూస్తే పవన్ ప్రమాణం చేసింది మంత్రిగానే. రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు

Update: 2024-06-12 13:30 GMT

పవన్ కళ్యాణ్ మంత్రిగా టీడీపీ కూటమి కేబినెట్ లో ప్రమాణం చేశారు. అయితే ఈ కార్యక్రమం కోసం మెగా ఫ్యామిలీ చాలా ఎక్కువగానే హడావుడి చేసింది అని అంటున్నారు. మెగా ఫ్యామిలీ ఒక రోజు ముందుగానే విజయవాడ చేరుకుని బస చేయడం, అలాగే ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రావడం అన్నీ జరిగాయి.

ఇక మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, సురేఖ, రాం చరణ్, నాగబాబు నిహారిక సహా ఇతర కుటుంబ సభ్యులు అంతా అటెండ్ అయ్యారు. పవన్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య, సతీమణి అన్నా లెజీనోవా సహా దాదాపుగా అంతా హాజరయ్యారు.

ఒక విధంగా పవన్ అను నేను రాష్ట్ర మంత్రిగా అన్న పవన్ ప్రమాణ స్వీకారాన్ని చాలా ఎక్కువగానే మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది అని అంటున్నారు. నిజానికి చూస్తే పవన్ ప్రమాణం చేసింది మంత్రిగానే. రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు.

దాంతో పవన్ కూడా రాష్ట్ర మంత్రి అని ప్రమాణం చేశారు. ఆయనకు ప్రభుత్వం ఆ హోదాను ఇస్తుంది. సరే ఈ హోదా బాగానే ఉన్న పవన్ అసలు టార్గెట్ సీఎం పదవి కదా అని అంతా అంటున్నారు. పవన్ సీఎం అని ఫ్యాన్స్ గొంతు ఎండిపోయేలా నినాదాలు చేస్తూ వచ్చారు మొత్తానికి పవన్ మంత్రి వరకూ వచ్చారు.

అది మంచిదే కానీ ఆయన సీఎం అయిన రేంజిలో మెగా ఫ్యామిలీ సందడి చేయడం పట్ల చర్చ సాగుతోంది. పవన్ సాధించింది ఒక ఎత్తు అయితే సాధించాల్సింది చాలానే ఉంది అని అంటున్నారు. ఆయన పదేళ్ళ పార్టీ ప్రస్థానంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. దాని వరకూ చూస్తే ఒక అచీవ్ మెంట్ గానే చూడాలి అయితే అదే అద్భుతం అన్నట్లుగా భావించడంలోనే తేడాలు వస్తాయని అంటున్నారు.

కేవలం పవన్ మంత్రి అయితే చాలు అని మెగా ఫ్యామిలీ అనుకుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మెగా ఫ్యామిలీకి మంత్రి పదవి కొత్త కూడా కాదు, ఇప్పటికి పుష్కర కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా ఇండిపెండెంట్ చార్జీతో అయ్యారు. రెండేళ్ల పాటు పనిచేశారు. అలా ఆ పదవితో పోలిస్తే పవన్ పదవి ఏమీ ఎక్కువ కాదు.

పైగా ఇది కూటమి ప్రభుత్వం. అందులో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. మొత్తం అంతా టీడీపీ కేబినెట్ గానే ఉంటుంది. బాబే సీఎం మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత సంబరం అన్న చర్చ అయితే సాగుతోంది.

అయితే ఇక్కడ ఒక విషయంలో చూస్తే మెగా ఫ్యామిలీ ఇంత సంబరం ఎందుకు చేసుకుందో అర్థం అవుతుంది అని అంటున్నారు. సినీ రంగంలో అప్రతిహత విజయాలు అందుకున్న మెగా ఫ్యామిలీకి రాజకీయంగా మాత్రం ఎదురు దెబ్బలే తగిలాయి. తమను సినీ సీమలో దేవుళ్ళుగా చూసిన ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ రాజకీయాల్లో మాత్రం పక్కన పెట్టడం పట్ల మెగా ఫ్యామిలీలో చాలా కాలంగా ఆవేదన ఉందని అంటారు.

దాంతో పాటు వైసీపీ అధికారంలోకి 151 సీట్లతో రావడం జనసేనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం రాజకీయంగా ఎక్కడా గెలవలేరు అని నిందించడం వంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది అతి పెద్ద విజయంగా భావించాలి. అయితే పొత్తులు లేకపోతే ఏమి జరుగుతుంది అన్నది పక్కన పెడితే అంతా కలిసారు విజయాన్ని అందుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఉంది.

అయితే పవన్ అసలైన రాజకీయం ఇక్కడ నుంచే మొదలు కావాల్సి ఉంది. ఆయన సీఎం కావాలన్న ఆశలకు ఈ మంత్రి పదవి నిచ్చెనలా ఎంతవరకూ పనిచేస్తుంది కూటమిలో పవన్ పాత్ర ఏ మేరకు ఉంటుంది, అధికారంలోకి ఒకసారి వచ్చిన తరువాత పవన్ మీద జనాల్లో అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది ఆయన అనుకున్నది సాధించగలరా ప్రజలకు మేలు చేసి సీఎం మెట్టు దాకా వెళ్లగలరా అన్నది రాజకీయ వెండి తెర మీదనే చూడాలి.

ఏది ఏమైనా అనుకున్నది మనకు దక్కకపోయినా అది జీవితకాలం ఆలస్యం అయి ఎంతో కొంత దక్కినా దాని విలువ అమూల్యం గా ఉంటుంది. పవన్ మంత్రి పదవి విషయంలో మెగానందాన్ని కూడా అలాగే చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News