రాజకీయ లెక్క తేల్చుకోనున్న మెగా ఫ్యామిలీ ?

అలాంటి చిరంజీవికి సినీ రంగంలో ఉన్న గౌరవ మర్యాదలు ఎక్కడా దొరకవు. ఆయన రారాజుగా ఉన్నారు.

Update: 2024-04-22 05:00 GMT

మెగాస్టార్ ఈ పేరు కంటే గొప్ప బిరుదులు ఏవీ లేవని అనేకసార్లు చిరంజీవే పబ్లిక్ ఫంక్షన్లలో చెప్పారు. నిజంగా అదే నిజం. చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన నటుడు. చిన్న పాత్రల నుంచి తన టాలెంట్ చూపించుకుని ఈ రోజున ఆయన టాలీవుడ్ కి పెద్ద దిక్కు అయ్యారు అంతే కాదు సౌతిండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో సరిసమానమైన ఇమేజ్ ఉన్న నేత. భారతీయ నటవర్గంలో చిరంజీవికి ఒక పేజి కచ్చితంగా ఉంటుంది.

అలాంటి చిరంజీవికి సినీ రంగంలో ఉన్న గౌరవ మర్యాదలు ఎక్కడా దొరకవు. ఆయన రారాజుగా ఉన్నారు. అంతే కాదు తన తరువాత వారసులను కూడా అధిక సంఖ్యలో తీసుకుని వచ్చారు. వారంతా జనం మెప్పు పొందారు. చిరంజీవి కుటుంబంలో స్టార్లు మెగా స్టార్లు కూడా ఎంతోమంది ఉన్నారు.

అలాంటి చిరంజీవి కుటుంబంలో ముందు తరాలకు కూడా హీరోలు తయారు అవుతున్నారు. మరో నాలుగేళ్లలో చిరంజీవి సినీ రంగంలోకి ప్రవేశించి యాభై ఏళ్ళు పూర్తి అవుతాయి. ఆ స్వర్ణోత్సవ సంబరాలు చేసుకోవాల్సి ఉంది. మరిన్ని దశాబ్దాలు ఏలే సత్తా ఉన్న నటులూ మెగా కాంపౌండ్ లో ఉన్నారు. ఇక పౌర పురస్కారాలు చూస్తే చిరంజీవిని వరించి వచ్చాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఆయనకు దక్కిన గొప్ప బిరుదులు.

ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్ డం ఉన్న నటుడు. తెలుగు సినిమా రంగంలో ఈజీగా వంద కోట్లని పై దాటి ఒక ప్రాంతీయ చిత్రం వసూల్ చేయగల సత్తా కలిగిన నటులలో పవన్ కూడా ఒకరు. అలాగే రాం చరణ్ అదే కుటుంబంలో మెగా పవర్ స్టార్ గా ఉంటున్నారు. మరి ఇంతమంది హీరోలు ఉండగా ఇంత చక్కని ఆదరణ గౌరవం ఉండగా మెగా ఫ్యామిలీ రాజకీయాల వైపు ఎందుకు చూస్తోంది అన్నది ఒక ప్రశ్న.

నిజానికి ఒక రంగంలో నంబన్ వన్ అయితే రెండవ రంగంలోనూ అవాలని ఏమీ లేదు. కానీ ఎందుకో చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేక కలిగించారా తెలియదు కానీ 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆయన చరిష్మా ఎన్టీయార్ కి సరితూగేదే. ఆయన కచ్చితంగా సీఎం అయ్యే క్యాండిడేట్. కానీ పార్టీ పెట్టిన టైం టైమింగ్ తప్పు కావడంతోనే ఆయన దెబ్బ తిన్నారు అయినా డెబ్బై లక్షలకు పైగా ఓట్లు అలాగే 18 సీట్లు రావడం గొప్ప విషయమే.

ఇక్కడ మరో తప్పు జరిగింది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే 2014 నాటికి ప్రజారాజ్యానికి మంచి ఫ్యూచర్ ఉండేదని అంతా చెబుతారు. కానీ అలా జరగలేదు. దాంతోనే జనసేన పెట్టారు పవన్ కళ్యాణ్ అని కూడా అంటారు ఇక జనసేన ప్రస్థానం పదేళ్ళుగా అంతా చూస్తున్నదే. 2014 నాటి పొలిటికల్ వాక్యూమ్ అయితే 2019 లో లేదు. అప్పటికే విభజన ఏపీలో టీడీపీ వైసీపీ అని రెండు పార్టీలు స్థిరపడిపోయాయి.

మూడవ పార్టీకి చాన్స్ రావడం అంటే ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి బలహీనం కావాలి. అందుకే జనసేనాని కూడా పొత్తుల ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా మెగా ఫ్యామిలీ 2024లో ఏదో తేల్చుకోవాలనే చూస్తోంది అని అంటున్నారు. అందుకే నాగబాబు పవన్ వెంట ఉన్నారు. చిరంజీవి అయితే కూటమికి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అయితే కచ్చితంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

ఈసారి టీడీపీ గెలిస్తే వైసీపీ బలహీనం అవుతుందని ఆ పొలిటికల్ వాక్యూమ్ లోకి జనసేన వెళ్లవచ్చు అన్న ఆలోచనలు ఏవో పవన్ కి ఉన్నట్లు ఉన్నాయని చెబుతారు. వాటి సాధ్యాసాధ్యాలు వేరే స్టోరీ. అవి అవుతాయా లేదా అంటే రాజకీయం అంటేనే నిరంతర మార్పు అలా జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు చేసుకుంటూ రారాజులుగా ఉండే మెగా ఫ్యామిలీ ఎందుకు రాజకీయాల విషయంలో సీరియస్ గా ఉంది అన్నదే ఇక్కడ ప్రశ్న. 2009 నుంచి మెగా కుటుంబం రాజకీయాల్లో ఉంటోంది. 2024 నాటికి లాజికల్ గా ఏదైనా సక్సెస్ దొరికితే ఆ కుటుంబం పదిహేనేళ్ళుగా సాగిస్తున్న స్ట్రగుల్ కి జవాబు దొరుకుతుంది. టీడీపీ కూటమి గెలిస్తే అది జరుగుతుంది. లేకపోతే ఏమిటి అన్నది కూడా ప్రశ్నగా ఉంది.]

ఇక ఈ సంగతి ఇలా ఉంటే మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా హర్ట్ అయింది అనే అంటున్నారు. అశేష విశేషమైన జనాభిమానం ఆ ఫ్యామిలీ సొంతం దానికి తోడు బలమైన సామాజిక వర్గం కూడా అండగా ఉంది. ఇన్ని ఉండి తాము ఎందుకు రాజకీయ పరమ పధ సోఫానం అధిరోహించలేకపోతున్నామన దాని నుంచే మెగా ఫ్యామిలీ లో ఈ పొలిటికల్ స్ట్రగుల్ మొదలైంది అని అంటున్నారు.

సినిమాల్లో సూపర్ హిట్లు ఉన్నాయి. పొలిటికల్ గా ఎందుకు లేవు అన్నదే వేద గానూ ఉంది. చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఓటమి పాలు అయ్యారు. నాగబాబు నర్సాపురం ఎంపీగా ఓడిపోయారు. అదే విధంగా పవన్ భీమవరం, గాజువాకలలో ఓటమి పాలు అయ్యారు. ఈ ఓటమి నుంచి గెలుపు స్వాంతనను పొందాలని రాజకీయంగానూ హీరోలుగా ఉండాలని ఆ ఫ్యామిలీ తపిస్తోంది.

ఇదంతా మంచిదే. పట్టుదల ఉండాలి. రాజకీయంగా తేల్చుకోవాలన్న తపన ఉండాలి. ఇపుడు అదే జరుగుతోంది కూడా. కానీ రాజకీయాల్లో ఏ లెక్కలూ కొలమానాలకి అందని వ్యవహారాలు ఉంటాయి. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ ని ఓడించిన ఓటర్లు ఉన్న దేశం ఇది. ఆయన కంటే అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుడు దేశంలో ఎవరూ లేరు. అలాగే తమిళనాడులో రజనీకాంత్ కంటే సూపర్ స్టార్ డం ఉన్న వారూ లేరు. ఆయన కూడా పార్టీ పెట్టాలని అనుకుని కూడా ధైర్యం చేయలేకపోయారు.

ఇక మెగా ఫ్యామిలీని కూడా జనాలు విపరీతంగా ఆరాధించేది సినిమా రంగంలో. రాజకీయాల్లో కూడా తాము విజయవంతంగా వెలుగొందాలన్న వారి ఆకాంక్ష మంచిదే. కానీ మెగా స్టార్ డం తో వారికి ఎన్ని ప్లస్సులు ఉన్నాయో మైనస్సులు ఉన్నాయి. మిగిలిన లీడర్ల మాదిరిగా జనంలోకి సులువుగా రాలేరు

అలాగే రాజకీయం అంటే నిరంతరం జనంలోనే ఉంటూ వారితోనే అడుగులు వేయాలి. ఎన్ని చేసినా ఎంత చేసినా విజయం దక్కుతుందా అంటే డౌట్. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈసారి రాజకీయంగా లెక్క తేల్చుకోవాలని చూస్తోంది. మరి సక్సెస్ కొడితేనే పదిహేనేళ్ళుగా చేస్తున్న పోరాటానికి సరైన జవాబు దక్కినట్లు. జనాలు ఏమి తీర్పు ఇస్తారు అన్నది జూన్ 4న చూడాల్సిందే.

Tags:    

Similar News