హాట్ టాపిక్... కూటమి తరుపున చిరంజీవి ప్రచారం మే 5 - 11!?
ఏది ఏమైనా... ఫృథ్వీ చెప్పినట్లుగా చిరంజీవి సుమారు వారం రోజుపాటు కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం అది కచ్చితంగా వైరల్ ఇష్యూనే అని భావించాలి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో కూటమి ప్రచారం కోసం చిరంజీవి ఎంట్రీపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ సమయంలో... ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... ఈసారి జరగబోయేవి ఎన్నికలు కాదు పేదలకూ పెత్తందారులకూ మధ్య యుద్ధం అని జగన్ చెబుతుంటే... జగన్ రహిత ఏపీయే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు! ఈ సమయంలో అనూహ్యంగా చిరంజీవి తెరపైకి వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ఏర్పడటం శుభపరిణామం అని ప్రకటించారు. ఇదే సమయంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ - పంచకర్ల రమేష్ బాబులతో కలిసి ఒక వీడియోని విడుదల చేశారు.
ఇందులో భాగంగా.. వీరిద్దరినీ గెలిపించాలని కోరారు. సీఎం రమేష్ కి సెంట్రల్ లో ఉన్న పరిచయాలతో అనకాపల్లి అభివృద్ధి మామూలుగా ఊండదన్నట్లుగా చిరు వ్యాఖ్యానించారు! దీంతో... చిరు ఈ సడన్ ఎంట్రీ ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో... కూటమి కోసం, ప్రధానంగా జనసేన కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారం కూడా చేస్తారనే ప్రచారం, చర్చా సోషల్ మీడియా వేదికగా మొదలైంది.
చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికి వస్తారని.. పవన్ కోసం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారని.. వీలైతే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనూ ఆయన ప్రచారం ఉండొచ్చని రకరాకాల ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో... జనసేన పార్టీ నేత, సినీ నటుడు ఫృథ్వీ రాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ)... చిరంజీవి ఎన్నికల ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో... మే నెల 5 నుంచి 11వ తేదీ వరకూ చిరంజీవి అవిరామంగా ప్రచారం చేస్తారని.. భారీ బహిరంగ సభలతో హోరెత్తించేస్తారని ఫృథ్వీ రాజ్ తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సమయంలో.. ఒక వేళ చిరంజీవి నిజంగానే సుమారు వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆ విషయం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... అసలు చిరంజీవి ఎన్నికల ప్రచారం అనే అంత హాట్ టాపిక్ ని, అంత పెద్ద విషయాన్ని అటు జనసేన కానీ, ఇటు చిరంజీవికి సంబంధించిన టీం కానీ అధికారికంగా ప్రకటించలేదు! అంత కీలకమైన విషయాన్ని ఫృథ్వీ రాజ్ వెల్లడించేశారు! దీంతో... ఈ విషయం నిజమేనా కాదా అనేచర్చ కూడా తదనుగుణంగా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై ఫృథ్వీ స్పందించిన తర్వాతైనా మెగా కాంపౌడ్ నుంచి క్లారిటీ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి!
ఏది ఏమైనా... ఫృథ్వీ చెప్పినట్లుగా చిరంజీవి సుమారు వారం రోజుపాటు కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం అది కచ్చితంగా వైరల్ ఇష్యూనే అని భావించాలి. ఇదే సమయంలో... అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారనేది మరింత ఆసక్తికరమైన విషయం కాబోతుంది. ఇదే క్రమంలో... ప్రజారాజ్యం గురించిన చర్చ కూడా మరోసారి లైవ్ లోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి!
ఈ నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రచారంపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వినిపించేవి, కనిపించేవన్నీ గాసిప్సే అని అంటున్నారు పరిశీలకులు! అధికారిక ప్రకటన వస్తే మాత్రం హైలెట్ ఇష్యూనే అని చెబుతున్నారు!!