మేకతోటి సుచరిత జనసేన లోకి ?
హోం శాఖ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడినవారంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, వైసీపీ కీలక నేత అయిన వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మరో కీలక మహిళా నేత వైసీపీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది. హోం శాఖ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరతారని విశ్వసనీయ సమాచారం.
మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి మొదటిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేశాక 2011లో వైసీపీలో చేరారు. ఆయనకు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలో ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2019లో వైసీపీ తరఫున సుచరిత విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో సుచరితను తాడికొండ నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ 39606 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2019లో ఎన్నికల్లో గెలిచాక మేకతోటి సుచరిత వైఎస్ జగన్ కేబినెట్ లో తొలి రెండున్నరేళ్లు హోం శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెను పదవి నుంచి తప్పించారు. దీంతో నాడు సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ లో ఉన్న దళిత మంత్రులందరిని కొనసాగించి తనను మాత్రమే తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అప్పడే ఆమె వైసీపీకి గుడ్ బై కొడతారనే వార్తలు వినిపించాయి.
అయితే వైసీపీ అధిష్టానం సుచరితను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా నియమించడంతో అప్పట్లో సర్దుకుపోయారు. మళ్లీ కొంతకాలానికే ఆమెను తప్పించి ఆ పదవిని డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అప్పగించారు. దీంతో సుచరిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఆమె మూడుసార్లు గెలుపొందిన ప్రత్తిపాడు నుంచి కాకుండా తాడికొండ నుంచి ఆమెను పోటీ చేయించారు. వాస్తవానికి తాడికొండ నుంచి పోటీ చేయడం ఆమెకు ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో సుచరిత వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆమె జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేనలో చేరతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఓసారి ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు సుచరిత వాటిని ఖండించారు. మరి తాజా ప్రచారంపై ఆమె ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.