'మ్యావ్‌-మ్యావ్‌' ఖ‌రీదు 2 వేల కోట్లు.. !!

మెఫెడ్రిన్‌ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు

Update: 2024-02-21 17:30 GMT

మ్యావ్‌-మ్యావ్‌.. స‌హ‌జంగా ఇళ్ల‌లో పెంచుకునే పిల్లుల‌ను ఉద్ద‌శించి ఇలా ప‌లుకుతాం. మ‌రి వీటి ఖ‌రీదు 2 వేల కోట్లు ఏంటి? అనుకుంటున్నారా? ఇక్క‌డ మ్యావ్‌-మ్యావ్‌.. అంటే.. కోడ్‌భాష‌! అత్యంత ఖ‌రీదైన మాద‌క ద్ర‌వ్యాన్ని వినియోగ‌దారులు, అమ్మే వారు పెట్టుకున్న ఓ కోడ్ .. మ్యావ్‌-మ్యావ్‌!! సాధార‌ణ ప‌రిభాష‌లో దీనిని మెఫిడ్రిన్ అంటారు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన డ్ర‌గ్‌. ఒక్క‌సారి తీసుకుంటే.. చాలు.. జీవితాంతం దీనికి బానిస‌లై పోతార‌ని అధికారులు చెబుతున్నారు.

సాధార‌ణంగా ఏ డ్ర‌గ్ అయినా.. నేర‌మే, హానిక‌ర‌మే. కానీ, మెఫిడ్రిన్ మ‌రింత డేంజ‌ర్‌. పైకి.. తెల్ల‌టి బియ్యం పిండి మాదిరిగా ఉండే దీనిని ముక్కు ద్వారా తీసుకుంటారు. ఇది దాదాపు మూడు రోజుల పాటు.. తీసుకున్న వ్య‌క్తిని మ‌త్తులో ఉంచుతుంది. ఒక్క‌సారి అల‌వాటు ప‌డితే.. దీని కోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తారు.. ఏమైనా చేస్తారు. అందుకే ఇది అత్యంత ఖ‌రీదు కూడా. తాజాగా ఈ డ్ర‌గ్‌ను మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

మ‌హారాష్ట్ర‌లోని పుణే నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్‌ వద్ద కుర్‌కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌లో 700 కేజీల మెఫిడ్రిన్‌ డ్రగ్‌ను సీజ్‌ చేశారు. మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్‌ ఏరియాలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్నారు. వీటి మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా రూ.2,200 కోట్లుగా అంచనా వేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

దీని పూర్తిస్థాయిలో నిషేధం..

మెఫెడ్రిన్‌ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. గతేడాది ముంబయిలో ఒక కర్మాగారంపై దాడి చేసి రూ.1,400 కోట్లు విలువైన మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నటుడి కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News