యుద్ధం.. బయటకు తీసుకురాని చీకటి కోణం!
పెద్దలు డిసైడ్ చేసే యుద్ధానికి అమాయక ప్రజలు శలభాల మాదిరి కాలి మసి అయిపోతుంటారు.
నాగరికత పేరు చెప్పుకుంటూ బతికేస్తున్నప్పటికి యుద్ధమనే అనాగిరకత ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అధిపత్యం కోసం.. వనరుల మీద పట్టు కోసం.. కారణం ఏదైతేనే బలవంతుడు బలహీనుడు చేసే యుద్ధం మనిషిని అశాంతిలోకి నెట్టేస్తుంది. పెద్దలు డిసైడ్ చేసే యుద్ధానికి అమాయక ప్రజలు శలభాల మాదిరి కాలి మసి అయిపోతుంటారు. చావు నుంచి తప్పించుకున్న కొందరు బతుకు మీద తీపితో పుట్టిన నేలను విడిచి పెట్టి.. పొట్ట చేత పట్టుకొని అశాంతి నుంచి దూరంగా పరుగులు తీస్తుంటారు.
పురాణాలు మొదలు నేటి నాగరిక సమాజంగా గొప్పులు చెప్పుకునే రోజుల్లోనూ ప్రపంచంలోని పలు దేశాల్లో సాగుతున్న యుద్ధాలు ఎంతోమంది అమాయకుల బతుకుల్ని దారుణంగా మార్చేస్తున్న దుస్థితి. అధికార దాహం.. తలకెక్కిన అహంకారం కోట్లాది మందిని పుట్టిన నేలకు పరాయిని చేస్తుంది. గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు పుట్టిన గడ్డను వదిలేసి.. బతికేందుకు వేరే ప్రాంతానికి వెళుతున్న దుర్మార్గానికి చెందిన గణాంకాలు బయటకు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది యుద్ధం కారణంగా నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది తల దాచుకోవటానికిశరణార్ధులుగా మారాల్సి వస్తోంది. పుట్టిన ఊరికే కాదు.. మాతృ దేశం నుంచి పరాయి దేశానికి వలస వెళ్లాల్సి వస్తోంది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషన్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 6.83 కోట్ల మంది ప్రజలు సంఘర్షణలు.. సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరో 4.5 కోట్ల మంది పొట్ట పట్టుకొని శరణార్థులుగా విదేశాలకు తరలిపోయారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఇలాంటి వారి సంఖ్య మరింత పెరగటం గమనార్హం.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలోని శరణార్థుల హక్కుల పరిరక్షణ కోసం 1951లో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఏర్పాటు వేళ 20 లక్షల మంది ఉండేవారు. 1980 నాటికి ఇలాంటి వారి సంఖ్య కోటికి చేరితే.. మరో పదేళ్లకు డబుల్ అయి రెండు కోట్లకు చేరుకుంది. 2010 నుంచి 2021 నాటికి మూడు కోట్లకు శరణార్థులు చేరుకున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 11 కోట్ల మంది శరణార్థులుగా మారారు.
2020 తర్వాత గడిచిన నాలుగేళ్లలో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లిపోయారు. సూడాన్ లో సైన్యం చేసిన ఆరాచకంతో శరణార్థుల సంఖ్యను మరింత పెంచితే.. ఇజ్రాయెల్ దాడులతో గాజా నుంచి గత ఏడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులైన ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థుల్లో మూడో వంతు అంటే 72 శాతం మంది ఐదు దేశాల నుంచి వస్తున్నారు.
ఆ ఐదు దేశాలు ఏమిటన్నది చూస్తే.. అత్యధికులు ఆసియా ఖండానికి చెందిన దేశాలు ఉండటం గమనార్హం. అఫ్గానిస్థాన్ 64 లక్షలు.. సిరియా 64 లక్షలు.. పాలస్తీనా 60 లక్షలు. అంటే.. దగ్గర దగ్గర 2 కోట్ల మంది. ఇక, ఉక్రెయిన్ 60 లక్షలు, వెనెజులా 61 లక్షలు ఉన్నారు. శరణార్థుల్లో అత్యధికులు తమ సమీప పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. అఫ్గాన్ శరణార్థులు పాకిస్థాన్.. ఇరాన్ లో ఉంటుంటే.. టర్కీలో ఎక్కువగా సిరియన్లు బతుకు వెళ్లదీస్తున్నారు. శరణార్థులు ఎక్కువగా ఉండే దేశాల జాబితా చూస్తే.. ఇరాన్ లో 38 లక్షలు, తుర్కియేలో 33 లక్షలు, కొలంబియాలో 29 లక్షలు, జర్మనీలో 26 లక్షలు, పాకిస్థాన్ లో 20 లక్షల మంది ఉన్నారు. మనిషి ఎంత నాగరికుడైనా.. తిండి కోసం మొదలుపెట్టిన యుద్ధం.. ఇప్పటికి కొనసాగుతోంది. అదే సగటు మనిషికి శాపమవుతోంది.