లోకేష్ కోసం మరొకరిని వెతకాల్సిందే ..!
ఇదేదో అనుకునేరు! రాజకీయంగా మంత్రి నారా లోకేష్‌ను ఎదిరించే నాయకుడు ఇప్పుడు అవసరం.
ఇదేదో అనుకునేరు! రాజకీయంగా మంత్రి నారా లోకేష్‌ను ఎదిరించే నాయకుడు ఇప్పుడు అవసరం. ఆయన ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారి టీ దక్కించుకున్న ఏకైక నాయకుడిగా(రెండు దశాబ్దాల్లో) నారా లోకేష్ రికార్డు సొంతం చేసుకున్నారు. దీంతో నారా వారి దూకుడుకు తిరుగు లేకుండా పోయింది. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ జెండా ఎత్తేందుకు భయ పడిన నాయకులు ఉన్నారు. కానీ, ఇప్పుడు రివర్స్ అయిపోయింది.
ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాయకులు భయపడడం లేదు కానీ.. అసలు లేరు ! బాబ్బాబు.. అని బ్రతిమాలినా.. ఎవరూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ వైసీపీ జెండా మోసే నాయకులు, జగన్‌కు జై కొట్టే కేడర్ కూడా కనిపించడం లేదు. ప్రాబ్లం ఉంటేనే కదా ప్రతిపక్షంతో అవసరం మాకంతా బాగుంది అన్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మురుగుడు ఫ్యామిలీ అంతా ఏకమైనట్టు కనిపించినా.. ఇప్పుడు ఫలితం వచ్చాక ఎవరూ కనిపించడం లేదు. ఇక,వైసీపీ నాయకురాలిగా ఉన్న మురుగుడు లావణ్య కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. బీసీ నాయకుడు గంజి చిరంజీవి పార్టీలో ఉన్నారా లేదా? అనేది ప్రధాన ప్రశ్న.
మరోవైపు.. వైసీపీ తరఫున చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అజా లేకుండా పోయారు. ఒకప్పుడు రాజధానిపై కేసులు వేసిన ఆయన.. బలమైన గళం వినిపించిన ఆయన.. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏదో జరిగిపోయిందని చెప్పిన ఆళ్ల.. తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక, ఇప్పుడు బలమైన నాయకులు ఎవరంటే వైసీపీలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. పైగా సర్కారు మొత్తం ఇక్కడే ఉంది. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌లు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటున్నారు.
ఇలాంటి కీలక స్థానంలో వైసీపీ తరఫున బలమైన గళం వినిపించే నాయకుడు లేకుండా పోవడం గమనార్హం. ఇటీవల వరదల సమయంలో కృష్నానదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీకి ఉన్న 68-69 గేట్ల వద్ద నాలుగు ఇనుప బోట్లు కొట్టుకురావడం.. బ్యారేజీకి డ్యామేజీ జరగడం తెలిసిందే. ఈ పరిధి మంగళగిరిలోనే ఉంది. ఆ సమయంలో వైసీపీపై విమర్శలు కోకొల్లులుగా వచ్చాయి. వీటికి కౌంటర్ ఇవ్వడంలో వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. దీనిని బట్టి.. మంగళగిరికి మరో నాయకుడిని వెతుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.