మథుర టెంపుల్ పై మంత్రి కఠిన శపధం
ఆయన తీసుకున్న శపధం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నుంచే ఒంటి పూట భోజనాన్ని అమలు చేస్తాను.
అయోధ్యలోని రామాలయ నిర్మాణం ఒక కొలిక్కి రావటమే కాదు.. అందులో ప్రతిష్ఠించిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగిన నేపథ్యంలో.. దశాబ్దాల తరబడి వివాదంలో నలుగుతున్న శ్రీక్రిష్ణుడి జన్మస్థలి అయిన మథురలో క్రిష్ణ ఆలయ నిర్మాణం కోసం ఒక రాష్ట్ర మంత్రి కఠిన శపథం చేశారు. రాజస్థాన్ కు చెందిన రాష్ట్ర విద్యా మంత్రి మదన్ దిలావర్ సంచలన శపధాన్ని చేపట్టారు. అయోధ్యలో మాదిరే మథురలో క్రిష్ణుడి టెంపుల్ కట్టే వరకు తాను ఒంటిపూట భోజనం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు.
ఆయన తీసుకున్న శపధం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నుంచే ఒంటి పూట భోజనాన్ని అమలు చేస్తాను. మథురలో శ్రీక్రిష్ణ మందిరం కట్టే వరకు ఒంటి పూట భోజనం చేస్తానంటూ ప్రమాణం చేసిన వైనం ఆ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ వార్తాంశంగా మారింది. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ మాట మీద నిలబడే వ్యక్తి.
ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే.. దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు తగ్గరు. అందుకోసం ఎంతకైనా శ్రమిస్తుంటారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు పార్టీ నేతలు.. అభిమానులు తీసుకొచ్చే పూలమాలలు తీసుకోనని శపథం చేశారు. అందుకు తగ్గట్లే.. గడిచిన కొన్నేళ్లుగా సదరు మంత్రిగారు తనకు వచ్చే పూలమాలల్ని స్వీకరించటం మానేశారు. తాజాగా అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో ఆయన తన శపథాన్ని పూర్తి చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. కాసింత వేడుక కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే.. ఆయన మీద అభిమానంతో కార్యకర్తలు భారీ ఎత్తున పూలమాలలు తీసుకొచ్చారు. దాదాపు 34 కేజీల బరువైన 108 అడుగుల గజమాలను తీసుకొచ్చి ఆయన మెడలో వేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన సున్నితంగా సత్కరించారు. జనవరి 31న అయోధ్య రాముడ్ని తన కళ్లారా చూస్తానని.. అక్కడి దర్శనం పూర్తి అయ్యాక మాత్రమే పూల మాలను స్వీకరిస్తానంటూ పేర్కొన్నారు.
తన మీద అభిమానంతో భారీ ఎత్తున ఉన్న గజ మాలను తీసుకురాగా.. తన శపధం పూర్తి కావొస్తుందన్న ఆయన.. తాజాగా మరో సంచలన శపథాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని ఏ రీతిలో అయితే పూర్తి చేశారో.. మథురలోనూ శ్రీక్రిష్ణ ఆలయాన్ని పూర్తి చేసిన తర్వాతే తాను రెండు పూటల భోజనం చేస్తానని.. అప్పటివరకు ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తానని పేర్కొన్నారు. తాజాగా మంత్రిగారి శపధం పుణ్యమా అని ఆయన గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారని చెబుతున్నారు.