అధికారంలో లేని పవన్‌పై ప్రశ్నలేల గుడివాడా?!: జనసేన కౌంటర్
జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈ మూడో దఫా యాత్రను విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నారు
వారాహి యాత్ర 3.0 గురువారం నుంచి ప్రారంభం కానుంది. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈ మూడో దఫా యాత్రను విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు అంటే.. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు. దీంతో ఇప్పటికే వారాహి 1.0, 2.0లను చూసిన వైసీపీ నాయకులు, మంత్రులు ఒకింత గాభరా పడుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. తాజాగా వైసీపీ మంత్రి, విశాఖపట్నంలోని అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. జనసేనానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలపై వారు ఫైర్ అవుతున్నారు.
ముందు మంత్రి వర్యుల మాట
పవన్ వారాహి 3.0 యాత్రను పురస్కరించుకుని మంత్రి గుడివాడ అమర్నాథ్ పది ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ''విశాఖ ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. ఏం విజయం సాధించారని వారాహి యాత్ర చేస్తారు? 175కి 175 పోటీ చేస్తానని పవన్ చెప్పగలరా? విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పగలరా? జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పేరు చెప్పగరలా? విశాఖను పరిపాలన రాజధాని ప్రకటించినప్పుడు..పవన్ స్వాగస్తున్నామని ఎందుకు చెప్పలేదు? టీడీపీ స్టాండే... జనసేన స్టాండా? బీజేపీతో పొత్తు ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదు? బీజేపీతో సంసారం...టీడీపీతో సహజీవనం చేస్తున్నారా?'' అని ప్రశ్నించారు.
జనసేన కౌంటర్
అయితే.. మంత్రి గుడివాడ ప్రశ్నలపై జనసేన నాయకులు కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు సంధించారు. అధికారంలో ఉన్న మీరు ఏం చేశారో చెప్పండి? మీరు బీజేపీతోను, మోడీతోనూ.. సహజీవనం చేస్తున్నారా? కేంద్ర బిల్లులకు ఎందుకు మద్దతిస్తున్నారు? విశాఖ ఉక్కుపై మీరెందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? రాజధాని పేరు చెప్పి ఇక్కడ భూములు దోచేస్తున్నారా? అయినా.. అధికారంలో లేని పవన్‌పై ఈ ప్రశ్నలేల గుడివాడా?... అని వారు నిలదీస్తున్నారు. మొత్తానికి వారాహి 3.0 యాత్ర రాజకీయ మంటలు పుట్టించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.