పవన్ కామెంట్లకు కు గుడివాడ కౌంటర్

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-08-11 08:17 GMT

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసిపి నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, దానిని కేంద్రానికి ఇచ్చి జగన్, వైసిపి నేతలను ఒక ఆట ఆడించకపోతే చూడండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైసిపి నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగం ఆసాంతం విషం, విద్వేషం, అహంకారంతో సాగిందని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను సీఎం పదవి నుంచి దించేయాలన్న అసూయ పవన్ లో స్పష్టంగా కనిపించిందన్నారు. ఇంటర్ ఫెయిల్ పవన్ ఆంధ్రా వర్సిటీ గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు.

జగన్ ను తిడితే నాయకుడు అయిపోవచ్చని పవన్ ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. అల్పుడెపుడు పలుకు ఆడంబరముగా అన్న సూక్తి పవన్ కు అతికినట్టు సరిపోతుందని ఎద్దేవా చేశారు. యువరాజ్యం అధ్యక్షుడు మొదలు జనసేన అధినేత వరకు... గత 15 ఏళ్లలో సిద్ధాంతం, స్థిరత్వం, నిలకడ, ఒక విధానం లేని రాజకీయ నాయకుడు పవన్ అని విమర్శించారు. బీజేపీతో సంసారం చేస్తున్న పవన్ టిడిపితో సహజీవనం చేస్తున్నారని చురకలంటించారు. జనసేన పార్టీ విధానం ఎజెండా ప్రకటించి ఓటు వేయాలని జనాన్ని పవన్ అడగడం లేదని, చంద్రబాబు స్కీమ్ లో పవన్ నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు.

జగన్ ను గద్దె దించాలి అని గొంతు చించుకొని అరుస్తున్న పవన్ తానే సీఎం అని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఎన్టీఆర్ తరహాలో చంద్రబాబుకు వెన్నుపోటు పొడవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. పొలిటికల్ ఐడెంటిటీ లేని పార్టీ జనసేన అని, పవన్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే భయపడే పరిస్థితుల్లో తాము లేమని అన్నారు. కేంద్రానికి కాకుంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కో, రష్యా అధ్యక్షుడు పుతిన్ కో చెప్పుకో అని అన్నారు, కేంద్రం దగ్గర పవన్ కు పలుకుబడి లేదని చంద్రబాబు దగ్గర మాత్రం రాబడి ఉందని చురకలంటించారు. రాజకీయాల్లో పవన్ ఓ పిల్ల బచ్చా అని, ఇటువంటి వారిని చూసి భయపడే వ్యక్తి జగన్ కాదని అన్నారు.

Tags:    

Similar News