టీడీపీలోకి బెంజ్ మంత్రి... చంద్రబాబు, చినబాబు ఎక్కడ?
అవును... వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో జాయిన్ అవుతున్నారు.
ఏపీలో అధికార వైసీపీ గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రుల స్థానాలను కూడా మార్చారు. అందుకోసం సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణాలు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా మార్చబడిన వారిలో మంత్రి గుమ్మనూరు జయరాం ఒకరు. ఈ క్రమంలో తాజాగా ఆయన సైకిల్ ఎక్కుతున్నారు.
అవును... వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రిపదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తోన్నారు! ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తనను కర్నూలు ఎంపీగా పోటీచేయాలని జగన్ అడిగారని.. అయితే అది తనకు ఇష్టం లేదని అన్నారు. తాను గుంతకళ్లు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అదంతా ఒకెత్తు అయితే... ఈ సందర్భంగా గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన స్టేట్ మెంట్లు, చంద్రబాబు చేసిన విమర్శలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధినేత చంద్రబాబు.. "బెంజ్ మంత్రి" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో తాము ఆరోపణలు చేసిన వారిని పార్టీలో చేర్చుకునేదే లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలో కర్నూలులోని బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు... “ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు.. ఆయన బెంజ్ కారు మంత్రి.. ఆయన చేసే పనేంటంటే.. క్లబ్బుల్లు పెట్టి పేకాట ఆడిస్తుంటాడు.. పక్క రాష్ట్రంలో మద్యం తెచ్చి అమ్ముతాడు.. భూకబ్జాలు చేస్తాడు” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక జయరాం విషయంలో చినబాబు లోకేష్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యువగళం పాదయాత్రలో భాగంగా గుమ్మనూరు జయరాం కు బెంజ్ మంత్రి అనే పేరుతో విరుచుకుపడిన లోకేష్... ఈ.ఎస్.ఐ. స్కాం తర్వాత ఈ మంత్రి బెంజ్ కారును గిఫ్ట్ గా తీసుకున్నారని విమర్శించారు! ఇదే క్రమంలో రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లకే కారుచౌకగా కొట్టేసిన ఘనుడు బెంజ్ మంత్రి అని దుయ్యబట్టిన లోకేష్... వ్యవసాయంలో లాభం వచ్చిందంటూనే.. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నారని ఫైరయ్యారు.
ఇదే క్రమంలో... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆక్రమించిన భూములను తామే రైతులకు పంచుతామని లోకేష్ తెలిపారు! ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలను మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అతిక్రమించారని, ఐటీ బినామీ యాక్ట్ ప్రకారం బెంజ్ మంత్రి దొరికిపోయారని.. మంత్రి జయరాంకు భూములు అమ్మిన మంజునాథ్.. సేల్ డీడ్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని నాడు లోకేష్ డిమాండ్ చే శారు.
ఇదే క్రమంలో... ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడిన లోకేష్... తాము ఆరోపణలు చేసిన వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకోమని గట్టిగా బల్లగుద్ది చెప్పారు! కట్ చేస్తే... చంద్రబాబు, లోకేష్ లు ఏ మంత్రిపై అయితే తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారో.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారో.. నేడు ఆ మంత్రినే సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తుండటంపై తీవ్ర చర్చ నడుస్తుంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో గుమ్మనూరు జయరాంపై పోటీచేసే వైసీపీ నేత ప్రత్యేకంగా ప్రచారం చేయనవసరం లేదని... నిన్నమొన్నటి వరకూ జయరాంని ఉద్దేశించి చంద్రబాబు, లోకేష్ చేసిన విమర్శల వీడియోలు ప్రదర్శిస్తే చాలనే కామెంట్లు వినబడుతున్నాయి. ఈ సందర్భంగా... చంద్రబాబు ఇంకా మారలేదని.. ఇలాంటి రాజకీయాలను ప్రజలు చీత్కరిస్తున్నారనే విషయం 2019 ఎన్నికల అనంతరం అయినా తెలుసుకోకపోతే ఎలా అని పలువురు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
ఇలా టీడీపీలోకి "బెంజ్ మంత్రిని" చేర్చుకునే విషయంలో అటు చంద్రబాబు కానీ, ఇటు చినబాబు లోకేష్ కానీ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇదే సమయంలో... ఇలాంటి వారికి తమ పార్టీలో ఎప్పుడూ శాస్వత స్థానం ఉంటుందని చెబుతారా.. లేక, గతంలో తము చేసినవన్నీ అసత్యాలతో కూడిన ఆరోపణలని అంటారా అనేది ఆసక్తిగా మారింది!