సీఎం సీటుపై కిష‌న్ రెడ్డి.. కేటీఆర్ క్రేజీ జోక్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ ఒక్క‌సారిగా తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే

Update: 2023-09-12 14:15 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ ఒక్క‌సారిగా తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. విపక్షాలు సైతం త‌మ ఎన్నిక‌ల వ్యూహాల‌కు ప‌దునుపెడుతూ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ త‌రుణంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ బానిస పార్టీలని మండిప‌డ్డారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు అని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌లో పైకి క‌నిపిస్తున్న‌ది ఈ ప్రాంత నేత‌లైతే, వారిని న‌డిపించేది ఆంధ్రా నేత‌ల‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాల్సిన స‌మ‌య‌మిద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిల తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని,

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామ‌ని చెప్పుకొంటున్నార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్న దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందని కామెంట్ చేశారు.

తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారని మండిప‌డ్డారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచందర్రావు, షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు. బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారని పేర్కొన్న కేటీఆర్ వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

బీజేపీలో పైకి కనబడేది కిషన్ రెడ్డి అయితే, ఆయ‌న‌ను న‌డిపించేది కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కేటీఆర్ కాంగ్రెస్‌లో కనబడేది రేవంత్ రెడ్డి అయితే ఆడించేది కేవీపీ రామచంద్రరావు అని మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం ఖ‌ర్మ అని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణవాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఒక్కరన్న రాజీనామా చేశారా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చార‌ని పేర్కొన్నారు. రాష్ట్రం ఇచ్చింది సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుందని కేటీఆర్ సెటైర్లు వేశారు.

నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా లేదా జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా ప్ర‌జ‌లు తేల్చుకోవాల‌ని కేటీఆర్‌ సూచించారు. ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే త‌మ దురదృష్టమ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు ఇటు బీజేపీ అడగదు అని ఆయ‌న మండిప‌డ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా వ‌న్ నేష‌న్ - వ‌న్ ఎల‌క్ష‌న్ పేరుతో బీజేపీ జిమ్మిక్ చేస్తోంద‌ని ఆరోపించారు. ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాన‌ని కలలు కంటే ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News