వినయ విధేయ రామకు పాత వీడియోలతో కొత్త తలనొప్పి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలోని మరే నేతకు లేని కొత్త తలనొప్పి మంత్రి కేటీఆర్ కు ఎదురవుతోంది

Update: 2023-11-17 04:33 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలోని మరే నేతకు లేని కొత్త తలనొప్పి మంత్రి కేటీఆర్ కు ఎదురవుతోంది. మాంచి మాటకారి అయిన కేటీఆర్.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని తన మాటలతో ఉతికి ఆరేసిన సందర్భాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి.

అధికారంలో ఉన్న వేళ ఒకలా.. ఎన్నికల వేళ మరోలా మాటలు చెబుతున్న కేటీఆర్ ను.. వినయ విధేయ రామ అంటూ కీర్తిస్తుండటం గమనార్హం. పాత వీడియోల్లో రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టుకొని.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన కేటీఆర్ చిట్టివీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పేరును 'వినయ విధేయ రామ' పేరుతో పిలుస్తున్నారు.

కారణం.. అగ్రెసివ్ గా ఉన్న వేళలో వెనుకా ముందు చూసుకోకుండా.. ఎంత మాట పడితే అంత మాట అనేసినా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. అలాంటి దూకుడు కేటీఆర్.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. తనను తాను మార్చుకుంటూ.. వీలైనంత డెమొక్రటిక్ గా.. సున్నితంగా.. సరళంగా మాట్లాడటం తెలిసిందే. ఎన్నికల పోటీ ఇంత తీవ్రంగా ఉన్న వేళ.. ఓటర్లను ఆకట్టుకోవటానికి వీలుగా తనలోని రఫ్ నెస్ ను వదిలేసి.. ఇంత సాఫ్ట్ గా మారటం వెనుక మతలబు.. ఎన్నికలని చెప్పక తప్పదు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ తీరును పక్కాగా ఫాలో అయ్యేలా ఆయన మీద కొత్త తరహా ప్రచారాన్ని షురూ చేశారు ఆయన ప్రత్యర్థులు. దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడే పాత వీడియోల్ని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అప్పటి రాముకు.. ఎన్నికల వేళలో ఉండే ఆయనలోని వ్యత్యాసాన్ని తాజాగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్పులు చూస్తే.. కేటీఆర్ విశ్వరూపం కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇప్పుడు పెద్ద మనిషిలా మాట్లాడుతున్న కేటీఆర్.. అప్పట్లో తనకంటే ఎంతో సీనియర్లు.. రాజకీయంగా హుందాగా వ్యవహరించిన జైపాల్ రెడ్డి.. జానారెడ్డి లాంటి వారిని నోటికి వచ్చినట్లుగా తిట్టేసి.. ఇప్పుడు వినయ విధేయ రామగా మాట్లాడటాన్ని ప్రశ్నిస్తున్నారు. పాత వీడియోలు సరికొత్తగా బయటకు రావటం.. వైరల్ గా మారటం కేటీఆర్ కు కొత్త తలనొప్పిగా మారిందంటున్నారు.

Tags:    

Similar News