ఆమె ఆధ్యాత్మిక మంత్రి !

టీడీపీలో దేవుడి మంత్రి ఉన్నారు. మళ్లీ కొత్తగా ఈ ఆధ్యాత్మిక మంత్రి ఏమిటి అని ఆశ్చర్యపోయేరు కాక. కానీ ఇది నిజం

Update: 2024-08-19 03:39 GMT

టీడీపీలో దేవుడి మంత్రి ఉన్నారు. మళ్లీ కొత్తగా ఈ ఆధ్యాత్మిక మంత్రి ఏమిటి అని ఆశ్చర్యపోయేరు కాక. కానీ ఇది నిజం. ఆ శాఖను ఆమె చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆమె ఎవరో కాదు పోలీసు మంత్రి వంగలపూడి అనిత. ఆ శాఖ మంత్రిగా ఆమె లాఠీ పట్టుకుని ఎంత కఠినంగా ఉంటారో దానికి పూర్తి భిన్నంగా ఆధ్యాత్మిక మంత్రిగానూ కనిపిస్తున్నారు.

వంగలపూడి అనిత ఏకంగా ఒకటి రెండు కాదు వేయి మెట్లు ఎక్కేసి మరీ సింహాచలం అప్పన్నస్వామి వారిని అత్యంత భక్తి ప్రపత్తులు మధ్య దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె కుటుంబ సమేతంగా ఈ విధంగా వచ్చి సింహాద్రి నాధుని సేవలో తరించారు. ఆ స్వామి ఆశీర్వాదం అందుకున్నారు.

హోంమంత్రి అనిత ఈ విధంగా ఉత్సాహంగా సాగించిన కాలినడకను చూసిన ఇతర భక్తులు సైతం ఆమెకు ఉన్న ఆధ్యాత్మిక భావాలను చూసి పులకించిపోయారు. అంతే కాదు నిన్నటికి నిన్న వరలక్ష్మీ వ్రతాన్ని చాలా గొప్పగా నిర్వహించి వరలక్ష్మీదేవి నుంచి వరాలు అందుకున్నారు

విశాఖలోనే ఉన్న బెల్లం వినాయకుడికి కూడా మహిళా మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారిని ఆరాధిస్తూ ఆ తల్లి కరుణను కూడా పొందారు. ఇలా విశాఖలోని అనేక ఆలయాలలో మంత్రి అనిత ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ దేవుళ్ళూ దేవతల దీవెనలు అన్నీ తన పరం చేసుకున్నారు.

వీటి కంటే ముందు తిరుమలలోని శ్రీవారి ఆశీస్సులు కూడా ఆమె అందుకున్నారు. తనకు భక్తి భావాలు మెండు అని ఆమె తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే తాను వీలు దొరికినపుడల్లా ఆధ్యాత్మిక భావనలోకి వెళ్తాను అన్నారు. హోం మంత్రిగా ఎంతో కీలకమైన శాఖ తీరిక లేని పనితో ఉండే అనిత ఇలా తనలోని భక్తి కోణాన్ని కూడా చాటుకోవడం చూసిన వారు ఆమెను మెచ్చకుండా ఉండలేకపోతున్నారు.

ఒక సాధారణ మహిళా భక్తురాలిగా ఉంటూ ఎలాంటి అధికార ఆర్భాటాలూ లేకుండా ఆమె చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులకు పెద్ద పదవులలో ఉన్న వారికి సైతం ఆదర్శం స్పూర్తిదాయం అని అంటున్నారు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు. అలా రాజకీయాల్లోకి వచ్చి తనను తాను రుజువు చేసుకుంటూ ఈ రోజున టాప్ ఫైవ్ పోర్ట్ ఫోలియోలలో ఒకటిగా ఉన్న హోం శాఖను చూస్తున్నారు.

ఆమె తన టాలెంట్ తోనే ఈ స్థితికి వచ్చారని రానున్న రోజులలో ఆమె పనితీరుతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి దేవుడి శాఖలు చూసే మంత్రులు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతారో తెలియదు కానీ అనిత మాత్రం అతి తక్కువ కాలంలోనే చాలా వరకూ దేవాలయాలు కలియతిరిగారని అంటున్నారు.

Tags:    

Similar News