మర్రికి షాక్:‘కాల్చి పడేస్తా’ మాటకు చర్యలకు ఆదేశాలు
తొందరపాటుతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే తిప్పలు తప్పవు.ఆచితూచి మాట్లాడకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా మర్రి జనార్ధన్ రెడ్డి నిలుస్తున్నారు.
నోటి నుంచి వచ్చే మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. తొందరపాటుతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే తిప్పలు తప్పవు. ఎన్నికల వేళ.. ఆచితూచి మాట్లాడకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా తాజాగా గులాబీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిలుస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన.. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్య చేయటం తెలిసిందే.
బీఆర్ఎస్ జోలికి వస్తే కాల్చి పడేస్తానంటూ చేసిన ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లురవి తో పాటు ఇతర నేతలు పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను ఈసీకి అందజేశారు. అలానే రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సూర్యాపేట కౌన్సిలర్ రేణుక మానవహక్కుల సంఘానికి కంప్లైంట్ చేసిన వైనాన్ని తమ కంప్లైంట్ లో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. అంతేకాదు.. ఏ తరహా చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలంటూ డీజీపీకి.. నాగర్ కర్నూలు.. నల్గొండ జిల్లాల ఎన్నికల అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. ఇష్టారాజ్యంగా మాట్లాడిన మర్రి జనార్దన్ కు తిప్పలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.