రాజయ్యపై మరోసారి నవ్య సంచలన వ్యాఖ్యలు
మొదటి నుంచి అంతా ఊహించినట్టుగానే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఈసారి సీటు దక్కలేదు
మొదటి నుంచి అంతా ఊహించినట్టుగానే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఈసారి సీటు దక్కలేదు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాజయ్యకు సీటు నిరాకరించారు. అక్కడ రాజయ్య ప్రత్యర్థి, మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేసీఆర్ సీటు కేటాయించారు.
వాస్తవానికి 2018 ఎన్నికలప్పుడే రాజయ్యకు సీటు ఉండదని టాక్ నడిచింది. అయితే ఆ ఎన్నికల్లో పెద్దగా రిస్కు చేయని కేసీఆర్ నాడు సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు కేటాయించారు. దీంతో రాజయ్య కూడా అప్పుడు సీటు దక్కించుకుని గెలుపొందారు.
గతంలో రాజయ్య డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడే ఒక హీరోయిన్ విషయంలో మంత్రి పదవి పోగొట్టుకున్నారని గాసిప్స్ నడిచాయి. అయినా సరే ఆయన తన తీరు మార్చుకోలేదు. జానకీపురం సర్పంచ్ నవ్య తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని.. అసభ్యంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఆరోపించడం కలకలం రేపింది.
నవ్య ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడం, మహిళా సంఘాల ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. నవ్యకు క్షమాపణలు చెప్పాలని రాజయ్యను ఆదేశించడంతో ఆయన స్వయంగా ఆమె వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని నవ్య ఆరోపించడంతో రూ.20 లక్షలు నిధులు కూడా కేటాయించారు. దీంతో ఇద్దరి మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. అయితే రాజయ్యకు టికెట్ రాలేదు.
ఈ నేపథ్యంలో జానకీపురం సర్పంచ్ నవ్య తాజాగా స్పందించారు. రాజయ్యకు టికెట్ రాకపోవటం నిజంగా బాధాకరమైన విషయమేనని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారని నవ్య గుర్తు చేశారు. అలాటి రాజయ్యకు ఈసారి టికెట్ రాకపోవటం బాధకలిగించే విషయమన్నారు. ఎవరికైనా.. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఉంటుందని నవ్య చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈసారి కూడా టికెట్ వస్తుందని ఆశించి ఉంటారని తెలిపారు. టికెట్ రాకపోవటంతో ఆయన చాలా బాధపడ్డారని చెప్పారు. ఆయన పరిస్థితి చూస్తుంటే తనకు కూడా చాలా బాధగా అనిపించిందని అన్నారు.
తనలో.. తప్పు చేస్తే నిలదీసే కఠిన గుణమే కాదని అమ్మగుణం కూడా ఉందని నవ్య తెలిపారు. రాజయ్య టికెట్ రాక బాధపడుతుంటే అయ్యో పాపం అనిపించిందన్నారు. తనకే కాకుండా ప్రతి ఒక్క మహిళకు కఠిన గుణంతో పాటు అమ్మతనం కూడా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పులు చేయడం సహజమన్నారు. అలాంటి వారిపై కోపం ఉంటుందని.. అయితే ఇలా బాధపడుతుంటే సంతోషించేంత కఠినమైన మనసు తనది కాదని నవ్య చెప్పడం విశేషం.
కాగా స్టేషన్ ఘనపూర్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం తన మద్దతుదారులతో సమావేశమైన ఆయన బోరుమని ఏడ్చేశారు. జనగామలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్షంలోనే తడుస్తూనే కాసేపు మౌనదీక్ష చేశారు. ఆ తరువాత తన వద్దకు వచ్చిన కార్యకర్తలపై పడి రాజయ్య రోదించారు. దీంతో కార్యకర్తలు కూడా ఆయనను చూసి విలపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య కార్యకర్తలంతా సంయమనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలన్నారు. కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని కోరారు. 2001 నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ ను తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రమ్మంటే ఆయన చెప్పిన మాట విన్నానని గుర్తు చేశారు. నీ స్థాయికి తగ్గట్టుగా అవకాశం ఇస్తాను అని ఆయన మాట ఇచ్చారన్నారు. అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. అధినాయకుడు చెప్పినట్లుగా ఏ పని చెప్పినా తూచా తప్పకుండా పనిచేస్తానని రాజయ్య వెల్లడించారు.